ట్రిపుల్‌ ఐటీలో విద్యార్థి ఆత్మహత్య

ట్రిపుల్‌ ఐటీలో విద్యార్థి ఆత్మహత్యనవతెలంగాణ -ముధోల్‌
నిర్మల్‌ జిల్లా బాసర ట్రిపుల్‌ ఐటీ యూనివర్సిటీలో ఓ విద్యా కుసుమం నేలరాలింది. హాస్టల్‌ గదిలో విద్యార్థి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్టు యూనివర్సిటీ అధికారులు తెలిపారు. వారి వివరాల ప్రకారం..
సిద్దిపేట జిల్లా తోగుట మండలం బండారుపల్లికి చెందిన బుచ్చుక అరవింద్‌ ట్రిపుల్‌ ఐటీలో పీయూసీ రెండో సంవత్సరం చదువుతున్నాడు. ఈ క్రమంలో హాస్టల్‌ గదిలో ఉరేసుకున్నాడు. మంగళవారం ఉదయం గమనించిన తోటి విద్యార్థులు యూనివర్సిటీ అధికారులకు సమాచారం అందించడంతో సెక్యూరిటీ సిబ్బంది స్థానిక ఆస్పత్రికి తరలించారు. అప్పటికే విద్యార్థి మృతిచెందినట్టు వైద్యులు నిర్ధారించారు. అనంతరం మృతదేహాన్ని నిర్మల్‌ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. విద్యార్థి తల్లిదండ్రులకు యూనివర్సిటీ అధికారులు సమాచారం అందించారు. ఈ నెల 18 నుంచి పీయూసీ రెండో సంవత్సరం విద్యార్థులకు ఫైనల్‌ పరీక్షలు నిర్వహిస్తున్నారు. విద్యార్థి హాజరు 50 శాతం కన్నా తక్కువగా ఉందని అధికారులు తల్లిదండ్రులకు తెలిపారు. దీంతో ఒత్తిడికి గురై విద్యార్థి ఆత్మహత్య చేసుకొని ఉంటాడని అనుమానిస్తున్నారు. విద్యార్థి మృతిపై యూనివర్సిటీ ఇన్‌ఛార్జి వైస్‌ ఛాన్స్‌లర్‌ వెంకటరమణ సంతాపం వ్యక్తం చేశారు.