గాజా మారణకాండపై విద్యార్థుల ఆందోళనలు!

గాజా మారణకాండపై విద్యార్థుల ఆందోళనలు!గాజాలో పాలస్తీనియన్లపై ఇజ్రాయిల్‌ జరుపుతున్న మారణకాండకు వ్యతిరేకంగా అనేక చోట్ల ముఖ్యంగా అమెరికా విశ్వవిద్యాలయాల్లో వెల్లడైన విద్యార్థుల నిరసన ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. దాని ప్రభావం ఇతర దేశాల మీద కూడా పడుతుండటంతో మొగ్గలోనే తుంచి వేయాలన్నట్లుగా అణచివేసేందుకు దమన కాండ జరుపుతున్నారు.జనాన్ని తప్పుదారి పట్టించేందుకు వక్రీకరణలతో ప్రచారం చేస్తున్నారు.విద్యార్థులకు ద్రవ్య పెట్టుబడి దారు జార్జి సోరోస్‌, ఇతరులు నిధులు అందచేస్తున్నారు. అది యూదు వ్యతిరేక ఆందోళన, బయటి వారు చేరారంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. విద్యార్థులు విశ్వవిద్యాలయాల ప్రాంగణాలలో గుడారాలు వేసుకొని నిరసన తెలుపుతున్నారు.వారికి ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా జార్జి సోరోస్‌ కుటుంబానికి చెందిన సంస్థలు, రాక్‌ఫెల్లర్‌ సోదరుల నిధి, బ్యాంకర్‌ ఫెలిస్‌ గెల్‌మాన్‌ తదితరులు పెద్ద మొత్తంలో విరాళాలు ఇస్తున్నారన్నది ఆరోపణ. ఢిల్లీ శివార్లలో రైతుల ఆందోళనలో పాల్గ్గొన్నవారి మీద కూడా ఇలాంటి నిందలే వేశారు. రైతులైన వారు ఖరీదైన కార్లలో ఎలా వచ్చారని ప్రచారం చేసినట్లుగానే అమెరికా విద్యార్థులకు అవసరమైన గుడారాలు, అక్కడ ఉంటూ తింటున్న పీజాలు, బర్గర్లకు డబ్బు ఎక్కడిది, ఆందోళనలో ఉన్నవారందరూ కలిగిన ఉన్నత కుటుంబాలకు చెందినవారు కాదా అంటూ ప్రశ్నిస్తున్నారు.పాలస్తీనియన్ల హక్కుల కోసం పనిచేసే వారిలో నెలకు 2,880 నుంచి 7,800 డాలర్ల వరకు స్టైఫండ్‌ పొందుతున్నవారు ఉన్నారని, విదేశీ నిధులు వస్తున్నాయని, విశ్వవిద్యాలయాల పరిసరాల్లో తిష్టవేసి వేరే పనిపాట లేకుండా ఆందోళనలను రెచ్చగొట్టేందుకు మాత్రమే పనిచేసే వారున్నారని ఇలా ఎన్నో ప్రచారాలు.
విద్యార్థులు, వారికి మద్దతిస్తున్న అకడమీషియన్లు ముందుకు తెస్తున్న డిమాండ్లేమిటి ? మొత్తంగా చూసినపుడు గాజా మీద ఇజ్రాయిల్‌ మారణకాండను తక్షణమే నిలిపివేయాలన్నది ప్రాధమిక అంశం. ఇజ్రాయిల్‌తో సంబంధం ఉన్న లేదా ప్రస్తుత దాడులతో లబ్దిపొందుతున్న ఆయుధ సంస్థలలో ఉన్న వందల కోట్ల డాలర్ల పెట్టుబడులను విశ్వవిద్యాలయాలు ఉపసంహరించాలి. కొలంబియా, హార్వర్డ్‌ వంటి విశ్వవిద్యాలయాలు భారీ మొత్తాలలో ఇలాంటి కంపెనీలలో పెట్టుబడులు పెట్టి వచ్చిన లాభాలను సిబ్బందికి వేతనాలు, స్కాలర్‌షిప్పులు, ఇతర అవసరాల కోసం వినియోగిస్తున్నాయి. ఇజ్రాయిల్‌తో ఉన్న అకడమిక్‌ సంబంధాలను తెగతెంపులు చేసుకోవాలి. గాజాలో దాడుల నిలిపివేతతో సహా మానవహక్కుల పరిరక్షణ ఉద్యమాలకు విశ్వవిద్యా లయాలు మద్దతివ్వాలి. పాలస్తీనాకు మద్దతు ఇస్తున్న విద్యార్ధులపై దమనకాండ నిలిపివేయాలి. విశ్వవిద్యాల యాల పెట్టుబడులను ఉపసంహరించు కోవాలన్న డిమాండ్‌ కొత్తదేమీ కాదు. గతంలో దక్షిణాఫ్రికాలో జాత్యహంకార పాలకులతో, ప్రభుత్వాలతో సంబంధాలున్న సంస్థల నుంచి 155 విశ్వవిద్యాలయాలు పెట్టుబడులను వెనక్కు తీసుకున్నాయి, సంబంధాలను తెగతెంపులు చేసుకున్నా యి. అంతే కాదు అమెరికాలో ప్రయివేటు జైళ్ల నిర్వహణ కంపెనీలు, పర్యావరణానికి హానిచేసే చమురు కంపెనీలలో పెట్టుబడులను కొన్ని విద్యాసంస్థలు వెనక్కు తీసుకున్నాయి. ఇక ఇజ్రాయిల్‌ దుశ్చర్యలను సమర్ధించేవారు దానితో సంబంధాలున్న సంస్థల నుంచి పెట్టుబడులను వెనక్కు తీసుకోవటం చట్టవిరుద్దం, ఇజ్రాయిల్‌ నాశనాన్ని కోరుకోవటమే అని వాదిస్తున్నారు.
విద్యార్థుల ఆందోళన ఒక్క అమెరికాకే పరిమితం కాలేదు, ఐరోపాకూ విస్తరించాయి.లండన్‌ విశ్వవిద్యాలయ కాలేజీ విద్యార్థులు ప్రదర్శన చేశారు. గాజా మారణకాండ నిలిపివేయాలని, ఇజ్రాయిల్‌ నేరాలకు నిధులు ఇవ్వరాదంటూ బ్రిటన్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.ఫ్రెంచి రాజధాని పారిస్‌లోని ప్రఖ్యాత పో యూనివర్సిటీలో పాలస్తీనా అనుకూల విద్యార్థుల ప్రదర్శనకు పోటీగా ఇజ్రాయిల్‌ అనుకూలురు రావటంతో ఘర్షణ వాతావరణం తలెత్తింది. పాలస్తీనా అనుకూలురు కాంపస్‌లోని భవనాన్ని ఆక్రమించి జెండాలను ఎగురవేశారు. విశ్వవిద్యాలయ పాలకవర్గం ఇజ్రాయిల్‌ దుశ్చర్యలను ఖండించాలని డిమాండ్‌ చేశారు. అన్ని విశ్వవిద్యాలయాలకూ ఆందోళన విస్తరించనున్నదని చెప్పారు. టర్కీ, ఆస్ట్రేలియాలో కూడా నిరసన వెల్లడైంది.కెనడాలోని మాంట్రియల్‌, కాంకోర్డియా విశ్వ విద్యాలయాల విద్యార్ధులు కూడా ఆందోళనకు దిగారు. పాలస్తీనాకు సంఘీభావం తెలుపుతూ మెక్‌గిల్‌ విశ్వ విద్యాలయంలోని వివిధ విభాగాలకు చెందిన విద్యార్ధులు 5,964(మొత్తంలో 80 శాతం) మంది ఆమోదించిన విధానాన్ని విశ్వవిద్యాలయం గౌరవించాలని డిమాండ్‌ చేస్తూ ధర్నా ప్రారంభించారు.ఇజ్రాయిల్‌ కంపెనీలలో ఉన్న పెట్టుబడులను వెనక్కు తీసుకోవాలని, సంబం ధాలను తెంచుకోవాలని కూడా ఆమోదించిన విధానంలో ఉందని వారు గుర్తు చేశారు. విద్యార్ధుల అభిప్రాయ సేకరణను వ్యతిరేకిస్తూ దాఖలైన పిటీషన్‌పై విచారణ ముగిసేవరకు పాలస్తీనాకు అనుకూలంగా ఎలాంటి వివాదాస్పద విధానాన్ని ఆమోదించకూడదని విశ్వ విద్యాలయ విద్యార్ధి సంఘాన్ని క్విబెక్‌ ఉన్నత న్యాయ స్థానం ఆదేశించింది.దీన్ని అవకాశంగా తీసుకొని విశ్వ విద్యాలయం విద్యార్థులను బెదిరిస్తున్నది. ఇజ్రాయిల్‌ కు యుద్ధ విమానాలను సరఫరా చేసిన లాక్‌హీడ్‌ మార్టిన్‌, సాఫ్రాన్‌ అనే ఒక ఫ్రెంచి కంపెనీలో రెండు కోట్ల డాలర కుపైగా ఉన్న మెక్‌ గిల్‌ విశ్వవిద్యాలయ పెట్టుబడులను వెనక్కు తీసుకోవాలని విద్యార్థులు కోరుతున్నారు. ఓటింగ్‌ ను గౌరవించేంత వరకు ధర్నా కొనసాగిస్తామని వారు స్పష్టం చేశారు.లండన్‌లో వివిధ తరగతులకు చెందిన వారు రెండులక్షల మంది ప్రదర్శన చేశారు. పాలస్తీనాకు సంఘీభావంగా జరుగుతున్న వాటి లో ఇది పన్నెండవది. ప్రతి ప్రదర్శనలో కొత్తవారు చేరుతు న్నారని నిర్వాహకులు వెల్లడించారు. అమెరికాలో విద్యా ర్థులు వీధుల్లోకి రావటం తమనెంతో ఉత్తేజపరిచిందని చెప్పారు.
అమెరికా విశ్వవిద్యాలయాల్లో యూదు వ్యతిరేక ప్రచారం జరుగుతున్నదని ఆరోపించిన అధికార యంత్రాంగం ఆ సాకుతో విద్యార్థులను అణచేందుకు పూనుకుంది.పలు చోట్ల వందలాది మందిని అరెస్టు చేసింది, అనుమతి లేకుండా ప్రాంగణాలలో ప్రవేశిం చారంటూ తప్పుడు కేసులు బనాయించింది. గుడారాలను తొలగించి ధ్వంసం చేసింది. ఈ చర్యలకు నిరసగా బోస్టన్‌ తదితర చోట్ల అనేక మంది విద్యార్థులకు మద్దతుగా నినాదాలు చేశారు. తమ కాలేజీతో సంబంధం లేని వారు విద్యార్థుల్లో చొరబడి యూదు వ్యతిరేకతను రెచ్చగొట్టారని, యూదులను చంపాలని ప్రేరేపించారని, దీన్ని సహించేది లేదంటూ కాలేజీ యాజమాన్యం ప్రకటన చేసింది. అలాంటిదేమీ లేదని విద్యార్ధులు ఖండించారు. ఇజ్రాయిల్‌ అనుకూల ప్రదర్శకులే రెచ్చగొడుతూ మాట్లా డారని పేర్కొన్నారు.మసాచుసెట్స్‌ సాంకేతిక సంస్థ కూడా అలాంటి ఆరోపణలే చేసింది. తొలుత కొలంబియా విశ్వవిద్యాలయ విద్యార్థులు నిరసన ప్రారంభించారు. తరువాత దేశమంతటా వ్యాపించింది. దక్షిణ కాలిఫోర్ని యా విశ్వవిద్యాలయం పట్టాల ప్రదాన కార్యక్రమాన్ని అడ్డుకుంది. సినీదర్శకుడు జాన్‌ ఎం చు ప్రధానవక్తగా చేయాల్సిన ప్రసంగాన్ని రద్దు చేశారు. పాలస్తీనియన్లకు బహిరంగంగా మద్దతు తెలపటమే అతను చేసిన తప్పిదం.
ఇజ్రాయిల్‌ దురాగతాలకు వ్యతిరేకత వెల్లడిస్తున్న విద్యార్థుల నిరసనలను అణచివేస్తున్న తీరు అమెరికా చెప్పే మానవహక్కులు, భావ ప్రకటనా స్వేచ్చ, ప్రజాస్వా మ్య కబుర్ల వంచను వెల్లడిస్తున్నది. విద్యార్ధుల మీదనే కాదు కొన్ని చోట్ల రోడ్ల మీద ఉన్న ఇతర పౌరులను కూడా అమెరికా పోలీసులు వదల్లేదు. అట్లాంటా ఎమోరీ విశ్వవిద్యాలయంలో టాసర్‌(విద్యుత్‌) తుపాకులు, భాష్పవాయు ప్రయోగం కూడా చేశారు. విద్యార్దులపై దమనకాండకు పాల్పడవద్దంటూ అడ్డుకొనేందుకు చూసిన ప్రొఫెసర్‌ కరోలిన్‌ ఫోలిన్ను పోలీసులు నెట్టివేశారు. దాంతో ఆమె తలకు గాయమైంది. కొన్ని చోట్ల రబ్బరు బుల్లెట్లను కాల్చారు, ఆశ్వికదళాన్ని మోహరించారు. మరికొన్ని చోట్ల విద్యాసంస్థల పరిసర భవనాలపై తుపాకులతో కాపాలా ఉన్న భద్రతా సిబ్బందిని ఏర్పాటు చేశారు. పలు చోట్ల మిలిటరీ దుస్తులతో ఉన్న దళాల కవాతు జరిపి భయపెట్టాలని చూశారు. టెక్సాస్‌ విశ్వవిద్యాలయాన్ని పోలీసులు అదుపులోకి తీసుకోవటంతో తాము తరగతులను నిర్వహించేది లేదని, ఇతర విద్యా సంబంధ పని కూడా చేసేది లేదని అక్కడి సిబ్బంది ఒక ప్రకటనలో తెలిపారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు నేషనల్‌ గార్డులను(మన సిఆర్‌పిఎఫ్‌ మాదిరి) రంగంలోకి దించాలని సెనెట్‌ సభ్యుడు జోష్‌ హాలే డిమాండ్‌ చేశాడు. నిజానికి అదే చేసి ఉంటే నిరసనలు మరింత తీవ్రంగా ఉండేవి. గాజాలో రోజురోజుకూ దమనకాండ పెరగటం దానికి అమెరికా మద్దతు ఇవ్వటంతో జనంలో పెరుగు తున్న వ్యతిరేకతకు నిదర్శనమే విద్యార్థుల కార్యాచరణ అన్నది స్పష్టం. రెండు దశాబ్దాలకు పైగా విదేశాంగశాఖలో అరబిక్‌ భాష ప్రతినిధిగా పనిచేసిన హలా హారిట్‌ గాజాపై అమెరికా విధానానికి నిరసనగా రాజీనామా చేశాడు. ఇదే సమస్యపై గతంలో మరో ఇద్దరు అధికారులు రాజీనామా చేశారు.
ఒక వైపు ఎన్నికలు, మరోవైపు ఇజ్రాయిల్‌కు మద్దతుగా మరింతగా ముందుకు వెళితే నిరసనలు హింసాత్మకంగా మారితే తన పరిస్థితి ఏమిటన్న ఆందోళనలో జో బైడెన్‌ ఉన్నట్లుగా చెబుతున్నారు. న్యూయార్క్‌ విశ్వవిద్యాలయ గౌల్డ్‌ ప్లాజా భవనాన్ని ఆక్రమించి ధర్నాకు దిగిన వారు ఖాళీ చేయకపోతే శిక్షలను ఎదుర్కోవాల్సి ఉంటుందని అధికారులు చేసిన బెదిరింపులను ఖాతరు చేయలేదు. ఇలా అనేక చోట్ల జరిగింది. గాజా పౌరులు ఎదుర్కొంటున్న ముప్పుకంటే తామెదుర్కొంటున్నది చాలా స్వల్పమని విద్యార్థులు బదులిస్తున్నారు. కొలంబియా విశ్వవిద్యాలయంలో నిరసన తెలుపుతున్న విద్యార్ధులకు మద్దతుగా వెయ్యి మంది బోధనా సిబ్బంది విశ్వవిద్యాలయ అధ్యక్షుడికి ఒక లేఖ రాశారు. సమాజంలో ఆర్థిక పరమైన అంశాలతో జరిగే ఆందోళనలకు విద్యార్థులు మినహాయింపు కాదు. గత కొద్ది రోజులుగా అమెరికా, ఐరోపాల్లో జరుగుతున్న ఆందోళనల వెనుక ఆర్థిక డిమాండ్లు లేవు. గాజాలో మారణకాండ సాగిస్తున్న యూదు దురహంకార ఇజ్రాయిల్‌, దానికి సంపూర్ణ వత్తాసు పలుకుతున్న తమ పాలక వర్గాలకు వ్యతిరేకంగా చైతన్యయుతంగా సాగిస్తున్న ఉద్యమం ఇది. గతంలో వియత్నాంలో అమెరికా సాగించిన దురాక్రమణ మీద పెద్ద ఎత్తున విద్యార్ధులు వెల్లడించిన తరువాత ఒక అంతర్జాతీయ సమస్య మీద మరోసారి ఈ పరిణామం సంభవించింది. ఇది కేవలం ఇజ్రాయిల్‌ తీరునే కాదు దానికి మద్దతుగా ఉన్న అమెరికా మధ్యప్రాచ్య వైఖరిని కూడా వ్యతిరేకించటమే.
ఎం కోటేశ్వరరావు
8331013288