ద్విచక్ర వాహనం అదుపుతప్పి విద్యార్థి మృతి..

– బీటెక్ చివరి రోజునే జీవితం ముగింపు
– దుర్ఘటనతో కళాశాలలో విషాద ఛాయలు
నవతెలంగాణ -నర్సంపేట
ద్విచక్ర వాహనంపై వెళ్తూ అదుపు తప్పి ఓ విద్యార్థి మృతి చెందిన సంఘటన చోటుచేసుకుంది. బీటెక్ చదువు చివరి రోజునే ఆ విద్యార్థి ప్రమాద సంఘటనతో తన జీవితానికి ముగింపు పలికిన దుర్ఘటన విషాదాన్ని నింపింది.. సూర్యాపేట జిల్లా కేంద్రం చింతల చెరువు ప్రాంతానికి చెందిన కుంభం సాయికిరణ్ (23) వరంగల్ జిల్లా నర్సంపేట మండలం లక్నెపల్లి గ్రామంలోని బిట్స్ కళాశాలలో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ చదువుతున్నాడు. బుధవారం బీటెక్ చదువులు పూర్తి చేసుకున్నాడు. ఇదే రోజునే ద్విచక్ర వాహనంపై సమీపంలోని లక్నెపల్లి గ్రామానికి వెళ్ళి తిరిగి వస్తుండగా అదుపు తప్పి కల్వర్టు లో పడిపోయాడు. తలపై తీవ్ర గాయాలయిన సాయికిరణ్ ను స్థానికులు అంబులెన్స్ ద్వారా నర్సంపేట లోని జిల్లా ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు పరీక్షలు చేసి అప్పటికే యువకుడు సాయికిరణ్ చనిపోయినట్లు నిర్ధారించారు. సాయికిరణ్ తల్లిదండ్రులకు కళాశాల సిబ్బంది సమాచారం అందించారు. బీటెక్ పూర్తి చేసుకున్న విద్యార్థులు సంతోషాలను పంచుకొనే రోజునే ప్రమాద సంఘటనలో విద్యార్థి సాయికిరణ్ అకాల మరణం చెందడం కళాశాలలో తీవ్ర విషాదం నెలకొంది.