ఆర్టీసీ బస్సు నుండి పడి విద్యార్థికి తీవ్ర గాయాలు

నవతెలంగాణ -మిరు దొడ్డి
మహాలక్ష్మి పథకంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచిత ఆర్టీసీ బస్సులో నుంచి ఓ విద్యార్థినీ  కిందపడి తీవ్ర గాయాలైన ఘటన అక్బర్ పేట- భూంపల్లి మండల కేంద్రంలో బుధవారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం అక్బర్ పేటకు చెందిన రాజు, రజిత ల రెండో కుమార్తె స్పందన మండల పరిధి నిజాంపేట్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 8వ తరగతి చదువుతుంది. ఈ క్రమంలో రోజు మాదిరిగానే  పాఠశాలకు వెళ్లడానికి అక్బర్ పేట స్టేజి దగ్గర సన్నద్ధమై ఉన్నది. కాగా మెదక్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు సిద్దిపేట నుంచి మెదక్ వెళుతున్నది. బస్సు డ్రైవర్ అక్బర్ పేట స్టేజి వద్ద కొన్ని నిమిషాల పాటు నిలిపాడు. అందులో స్పందనతో పాటు మరో నలుగురు విద్యార్థులు బస్సులోకి ఎక్కారు. అప్పటికే బస్సులో సుమారు 140 మందితో రద్దీగా ఉన్నది. ఈ క్రమంలో వేరే బస్సులో వెళ్లాలంటే పాఠశాల సమయం మించి పోతుందనే ఉద్దేశంతో గత్యంతరం లేక ఆ బస్సులోనే వెళ్లడానికి సిద్ధమయింది. బస్సు కదలడంతో డోర్ లో నిలబడిన స్పందన ప్రమాదవశాత్తు కాలుజారి కింద పడ్డది. దీంతో ఆమెకు కాలుకు తీవ్ర గాయమై రక్తస్రావమైనది. స్పందన బస్సు లోంచి కింద పడ్డప్పటికీ బస్సును డ్రైవర్ నిలపలేదు.   కదులుతున్న బస్సును స్థానికులు వెంబడించారు. దీంతో బస్సు డ్రైవర్ నగరం గ్రామ శివారులో నిలపాడు.  బస్సులో నుంచి విద్యార్థిని కింద పడ్డప్పటికీ ఎందుకు బస్సును నిలపలేదంటూ వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.  ఉన్నతాధికారులు వచ్చేంతవరకు బస్సు ఇక్కడి నుంచి కదలనివ్వమని  ఆందోళన చేశారు. నిర్లక్ష్యంగా బస్సులు నడుపుతున్న డ్రైవర్ పై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు. ఈ విషయం తెలుసుకున్న భూంపల్లి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.  స్థానికులను శాంతింప చేసే ప్రయత్నం చేసినప్పటికీ లాభం లేక పోయింది.  పాఠశాల,  కళాశాల వేళల్లో విద్యార్థుల కోసం ప్రత్యేకంగా బస్సులను నడిపించాలన్నారు. మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడంతో బస్సులన్నీ రద్దుగా ఉంటున్నాయన్నారు. దీంతో తరగతులకు హాజరయ్యే విద్యార్థులు ప్రమాదాల బారిన పడడం భయాందోళన గురిచేస్తుందన్నారు. పాఠశాల,  కళాశాల తరగతులకు హాజరయ్యే విద్యార్థులకు ప్రత్యేక బస్సులను నడిపించడానికి చర్యలు తీసుకునేలా అధికారులకు విన్నవిస్తామని పోలీసులు హామీ ఇవ్వడంతో స్థానికులు విద్యార్థిని తల్లిదండ్రులు ఆందోళన విరమించారు. చికిత్స నిమిత్తం క్షతగాత్రులైన విద్యార్థిని స్పందనను నిజాంపేటలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.