మోడీ స్కూల్‌కు విద్యార్థుల అధ్యయన యాత్రలు

Student study trips to Modi School–  ఇందుకోసం విద్యా మంత్రిత్వ శాఖ ప్రత్యేక పోర్టల్‌ ప్రారంభం
–  ఏడాది పాటు కార్యక్రమం విద్యార్థుల్లో మోడీకి ప్రచారం కల్పించే యత్నం
–  కేంద్రం తీరుపై సామాజికవేత్తలు, ప్రతిపక్ష పార్టీ నాయకుల ఆందోళన
న్యూఢిల్లీ: గుజరాత్‌లోని వాద్నాగర్‌లోని ప్రధాని మోడీ చదువుకున్న పాఠశాలను దేశవ్యాప్తంగా విద్యార్థులు సందర్శించే కార్యక్రమం వివరాలతో కూడిన పోర్టల్‌ను కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ ప్రారంభించింది. ప్రేరణ అనే ప్రోగ్రామ్‌లో పాల్గొనటానికి 9-12 తరగతి విద్యార్థులు పోర్టల్‌లో నమోదు చేసుకోవాలి. దరఖాస్తుదారులు మూడు దశల ఎంపిక ప్రక్రియ ద్వారా వెళ్తారు. ఇందులో చిన్న వీడియోను రికార్డ్‌ చేయడం, వ్యాసాలు లేదా కవితలు లేదా కథలు రాయటం, ‘ప్రేరణ కోసం నన్ను ఎందుకు ఎంచుకోవాలి’ లేదా ‘ 2047పై నా విజన్‌ ఆఫ్‌’ వంటి అంశాలపై సృజనాత్మక వ్యక్తీకరణలు రాయటం వంటి కార్యకలాపాలు ఉంటాయి.
కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ ప్రకారం.. కనీసం ఒక సంవత్సరం పాటు కొనసాగే కార్యక్రమంలో పాల్గొనటానికి ప్రతి జిల్లా నుంచి ఇద్దరు విద్యార్థులతో 20 మందితో కూడిన బ్యాచ్‌లు(10 మంది బాలికలు 10 మంది అబ్బాయిలు) ఎంపిక చేయబడతాయి. యువతను మార్పునకు ఉత్ప్రేరకాలుగా మార్చటం కోసం ప్రేరేపించడానికి ప్రేరణను ప్రారంభించాలని ప్రభుత్వం తన ప్రణాళికను 2022, జూన్‌లో ప్రకటించింది.
ప్రధాని మోడీ 1956లో 1వ తరగతిలో చేరిన ఈ ప్రాథమిక పాఠశాల 1888లో స్థాపించబడింది. ఈ ప్రాథమిక పాఠశాలలో వారం రోజుల పాటు అధ్యయన యాత్ర నిర్వహించబడుతుంది. ఇందులో పలు అంశాలు, కార్యక్రమాలు ఉన్నాయి. ది వాద్నగర్‌ కుమార్‌ శాల నెం.1 2018 వరకు పని చేసింది. దీనిని భారత పురావస్తు శాఖ (ఏఎస్‌ఐ) పునరుద్ధరించింది. ఇప్పుడు ఇది ‘ప్రేరణ’ స్కూల్‌గా పిలవబడుతుంది.
విద్యార్థుల అధ్యయన యాత్ర కోసం గుజరాత్‌లో మోడీ చదువుకున్న పాఠశాలను ఎంచుకోవటం వెనకున్న ఉద్దేశం ఏమిటనీ సామాజిక కార్యకర్తలు, ప్రజా సంఘాల నాయకులు ప్రశ్నిస్తున్నారు. ఇందు కోసం స్వాతంత్య సమరయోధులు విద్యనభ్యసించిన ప్రదేశాలు, విద్యా సంస్థలు వంటివి ఉపయోగిస్తే విద్యార్థులకు అసలైన ప్రేరణగా ఉంటుందని వారు సూచిస్తున్నారు. విద్యార్థుల మెదళ్లలో మోడీని గొప్ప నాయకుడిగా చిత్రీకరించటానికే కేంద్రంలోని అధికార బీజేపీ సర్కారు యత్నిస్తున్నదని ప్రతిపక్ష రాజకీయ పార్టీలు ఆరోపిస్తున్నాయి. ఇందుకు అధికారాన్ని సైతం దుర్వినియోగం చేస్తున్నదని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.