నవతెలంగాణ-బోడుప్పల్
శ్రీచైతన్య కళాశాల హాస్టల్‌లో ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మేడిపల్లి పీఎస్ పరిధిలోని కళాశాలలో గురువారం జరిగింది. మేడిపల్లి సీఐ పి.సైదులు తెలిపిన వివరాల ప్రకారం..వనపర్తి పట్టణానికి చెందిన బి.ఒరయ్య కుమార్తె వర్ష(17) పీర్జాదిగూడ కార్పొరేషన్ పరిధిలో ఉన్న శ్రీ చైతన్య కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది. గురువారం హాస్టల్ బాత్‌రూంలో ఆమె ఉరేసుకుంది. తోటి విద్యార్థినులు గమనించి యాజమాన్యానికి చెప్పారు. కళాశాల యాజమాన్యం మేడిపల్లి పోలీసులకు సమాచారం ఇచ్చింది. పోలీసులు కళాశాలకు వెళ్లి పరిశీలించి.. విద్యార్థిని మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. మానసిక ఒత్తిడి, తల్లిదండ్రులకు దూరంగా ఉండలేకపోవడంతో ఆత్మహత్య చేసుకున్నట్టు కళాశాల యాజమాన్యం చెబుతోంది. శీచైతన్య డీన్ మమత వేధింపులు భరించలేక ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుందని టీవీఎస్ విద్యార్థి సంఘం నాయకులు హరీష్‌గౌడ్, శ్రీనివాస్ రెడ్డి ఆరోపించారు. విద్యార్థిని కుటుంబానికి న్యాయం చేయాలని, దీనికి బాధ్యత వహిస్తూ యాజమాన్యం డీన్ మమతను ఉద్యోగం నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి రూ. 50 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు. దీనిపై ఇంటర్మీడియట్ బోర్డు ఒక కమిటీ వేసి తగు చర్యలు తీసుకోవాలని కోరారు.