
అయోడిన్ లోప రుగ్మతలను నివారిద్దామని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి హర్షవర్ధన్ అన్నారు. ప్రపంచ అయోడిన్ లోప రుగ్మతల దినోత్సవం సందర్భంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో మంగళవారం ఆదర్శ పాఠశాల (అనంతారం)లో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యాధికారి హర్షవర్ధన్ మాట్లాడుతూ మానసిక శారీరక ఆరోగ్యం సరైన పెరుగుదల చురుకుదనం ఉత్సాహం జ్ఞాపకశక్తి కలిగి ఉండడం సంగ్రహణ శక్తి పెరగడం వంటి అనేక రకాల ప్రయోజనాలు ఒక అయోడైజ్డ్ ఉప్పులో ఉన్నాయన్నారు. సరైన మోతాదులో వాడకపోతే గర్భస్రావం, మృత శిశువు జననం, గొంతువాపు, మరుగుజ్జుతనం, చెవిటి, మూగ, బుద్ధి మాంద్యం చదువులో వయసుకు తగ్గ ప్రతిభ చూపించకపోవడం వంటి అనేక రకాల సమస్యలను నష్టాలను చవిచూడాల్సి వస్తుందని తెలిపారు. కావున ఈ సమస్యలు చెంతకు చేరకుండా ఉండాలంటే అయోడైజ్డ్ ఉప్పునే వాడాలన్నారు.ఈ విషయాలపై విద్యార్థులు తమ తమ గ్రామాల్లో ప్రజలకు, తల్లిదండ్రులకు అవగాహన కల్పించడంతో పాటు వారికి తగ సూచనలు సలహాలు ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో హెల్త్ ఎడ్యుకేటర్ విమల, ఆరోగ్య కేంద్ర సిబ్బంది కలమ్మ, బేబీ, రాధిక మరియు మోడల్ స్కూల్ ఉపాధ్యాయులు, అధ్యాపకులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.