అనుమానాస్పద స్థితిలో విద్యార్థులు ఆత్మహత్య

నవతెలంగాణ-భువనగిరి రూరల్‌
యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరిలోని ఎస్టీ గురుకుల పాఠశాలలో ఇద్దరు విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. భవనగిరి పట్టణంలోని ఎస్టీ గురుకుల పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న కోడి భవ్య, గాదె వైష్ణవి.. శనివారం రాత్రి ఒకే గదిలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. గమనించిన తోటి విద్యార్థులు, హాస్టల్‌ సిబ్బంది.. 108 అంబులెన్స్‌తో పాటు పోలీసులకూ సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు.. విద్యార్థుల మృతదేహాలను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. విద్యార్థినుల ఆత్మహత్యకు గత కారణాలపై పోలీసులు హాస్టల్‌లో ఆరా తీస్తున్నారు. పరీక్షల భయంతో చనిపోయారా లేదా ఇతర కారణాలేమైనా ఉన్నాయా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. కాగా, అప్పటివరకు తమతో ఉన్న వారు ఉరేసుకొని చనిపోవడంతో తోటి విద్యార్థినులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.