టీచర్ల బదిలీపై విద్యార్థుల ఆందోళన

 Adilabad– డీఈఓ చొరవతో విరమణ
నవతెలంగాణ-మందమర్రి
ఉపాధ్యాయుల బదిలీపై ఆదర్శ పాఠశాల విద్యార్థులు పాఠశాల ఎదుట ఆందోళనకి దిగారు. డీఈఓ యాదయ్య చొరవతో సద్దుమనిగిన ఆందోళన. పాఠశాల ఉపాధ్యాయులందరూ ఒకేసారి బదిలీ కావడంతో మంగళవారం విద్యార్థులు పాఠశాల ఎదుట ఆందోళన చేస్తూ తరగతులను బహిష్కరించి నినాదాలు చేశారు. తల్లిదండ్రుల తర్వాత గురువులను మార్గదర్శకులుగా భావిస్తారు. కాస్త ప్రేమ చూపే ఉపాధ్యాయులపై మమకారం పెంచుకుంటారు. వారు ఒక్కరోజు పాఠశాలకు రాకపోయినా ఆరా తీస్తారు. అలాంటిది ఏకంగా పాఠశాల నుండి బదిలీ కావడంతో ఒప్పుకోమంటున్నారు. పాఠశాలలో పనిచేసిన ఇన్‌చార్జి ప్రిన్సిపాల్‌ గణితం బోధించే జయకృష్ణరెడ్డి ఉపాధ్యాయుడంటే పిల్లలందరికీ ఎంతో ఇష్టమని, పాఠశాల అభివృద్ధితో పాటు విద్యార్థులకు మార్గదర్శకంగా ఉండే వారని విద్యార్థుల పేరెంట్స్‌ తెలిపారు. అయితే మూడు రోజుల క్రితం సర్దుబాటులో భాగంగా విద్యాశాఖ ఉన్నతాధికారులు ఇన్‌చార్జి ప్రిన్సిపాల్‌తో పాటు అందరినీ బదిలీ చేశారు. ఈ విషయాన్ని విద్యార్థులు జీర్ణించుకోలేకపోతున్నారు. ‘మా టీచర్‌లు మాకే కావాలి అకాడమిక్‌ ఇయర్‌ మధ్యలో బదిలీ చేయొద్దు’ మమ్మల్ని మోసం చేయొద్దు అంటూ నినాదాలు చేస్తూ బైఠాయించారు. ఎస్‌ఐ రాజశేఖర్‌ నూతన ప్రిన్సిపాల్‌ సారా తస్నీం విద్యార్థులను ఎంత సముదాయించిన తమ టీచర్‌లను ఇక్కడే కొనసాగించాలని తమకు న్యాయం చేయాలంటూ డిమాండ్‌ చేశారు. ఈ విషయంపై డీఈఓ యాదయ్యను చరవాణిలో సంప్రదించగా వారు స్పందిస్తూ నిబంధనల మేరకే బదిలీలు జరిగాయని బదిలీ ప్రక్రియను పున్ణ పరిశీలిస్తామని విద్యార్థులతో చెప్పడంతో ఆందోళనను విరమించుకున్నారు. ఇదిలా ఉండగా గతంలో పాఠశాలలో పని చేసిన ముఖ్యమైన వారు కొందరు విద్యార్థులు వారి తల్లితండ్రుల సహకారంతో పథకం ప్రకారమే ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే ప్రక్రియకి తెరలేపినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.