
– అంగన్వాడీ కేంద్రాలలో సమయపాలన తప్పనిసరి
– 15 రోజులలో మరుగుదొడ్లను నిర్మించాలి
– ఇకపై అంగన్వాడీ కేంద్రాల తనకిలు : కలెక్టర్ నారాయణరెడ్డి
నవతెలంగాణ – నల్గొండ కలెక్టరేట్
జిల్లాలోని అన్ని కేజీబీవీలు, మోడల్ పాఠశాలలో విద్యార్థుల కు వచ్చే శుక్రవారం స్క్రీనింగ్ పరీక్షలను పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి ఆదేశించారు. గురువారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో పోషణ అభియాన్ పై మహిళా శిశు సంక్షేమ శాఖ అంగన్వాడీ సూపర్వైజర్లు, సిడిపిఓలు, అంగన్ వాడి టీచర్లతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, సిడిపిఓలు, వైద్యాధికారులు ఆర్ బి ఎస్ కే కింద అన్ని కేజీబీవీలు, మోడల్ పాఠశాలల్లో విద్యార్థులకు స్క్రీనింగ్ పరీక్షలను నిర్వహించాలని అన్నారు. అలాగే అంగన్వాడి టీచర్లు పౌష్టికాహార లోపంతో ఉన్న పిల్లలు, వయసుకు తగ్గ బరువు లేమితో బాధపడుతున్న పిల్లలను గుర్తించాలని, అనంతరం వారికి సరైన పౌష్టికాహారం అందించేందుకు ప్రణాళిక రూపొందించాలని, ఈ విషయంలో తల్లిదండ్రులకు సైతం అవగాహన కల్పించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
24 గంటల ప్రసవాలకు ఏర్పాట్లు..
జిల్లాలోని నల్గొండ ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రి తో పాటు, దేవరకొండ, మిర్యాలగూడ, నాగార్జునసాగర్ ప్రభుత్వాసుపత్రులలో 24 గంటలు ప్రసవాలు జరిగే విధంగా ఏర్పాట్లు, సౌకర్యాలు కల్పించడం జరిగిందని, అందువలన అంగన్వాడీ టీచర్లు ఈ విషయంలో వైద్య ఆరోగ్యశాఖకు పూర్తి సహకారం అందించాలని అన్నారు. ప్రైవేట్ ఆస్పత్రులకు డెలివరీలు వెళ్లకుండా ప్రభుత్వ ఆసుపత్రిలోనే కాన్పులు అయ్యేలా చూడాలని, దీనివల్ల ఆపరేషన్లు జరిగే సంఖ్య తగ్గుతుందని తెలిపారు. అలాగే మహిళ గర్భం దాల్చిన తర్వాత తక్షణమే రిజిస్ట్రేషన్ చేయించడం, ప్రతినెలా క్రమం తప్పకుండా ఏఎన్సి పరిశీలన, మందులు వినియోగం తదితర వాటన్నింటిపై నిర్లక్ష్యం లేకుండా డెలివరీ అయ్యే వరకు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అలాగే చిన్న పిల్లలకు వ్యాక్సినేషన్ తప్పనిసరిగా ఇవ్వాలన్నారు. ప్రాథమిక పూర్వ విద్యను అంగన్వాడి కేంద్రాల ద్వారా తప్పనిసరిగా ఇవ్వాలని, ఇందుకుగాను అంగన్వాడీ కేంద్రాలు పద్ధతి ప్రకారం పని చేయాలని సూచించారు.
సమయపాలన తప్పనిసరి..
అంగన్వాడీ టీచర్లు ప్రత్యేకించి పని విభజనను చేసుకోవాలని, ప్రభుత్వం నిర్దేశించిన సమయం ప్రకారం కేంద్రాలు పని చేయాలని,ఉదయం 9 నుండి సాయంత్రం 4 గంటల వరకు నూటికి నూరు శాతం నడపాలని ఆదేశించారు. అంగన్వాడి కేంద్రంలో చేరిన పిల్లల హాజరు తప్పనిసరిగా 90 శాతం ఉండాలని, ప్రభుత్వం అనుమతించిన ఆమోదించిన సిలబస్ ను తప్పకుండా పిల్లలకు బోధించాలని, నెలవారీగా చేసే కార్యక్రమాలపై షెడ్యూల్ ను రూపొందించాలని ఇకపై గ్రామపంచాయతీ తనిఖి సందర్భంగా అంగన్వాడి కేంద్రాలను సైతం తనిఖీ చేస్తామని చెప్పారు. మరుగుదొడ్లు లేని 240 అంగన్వాడి కేంద్రాలలో రానున్న 15 రోజుల్లో నిర్మించాలని డిపిఓ ను ఆదేశించారు. అనంతరం అంగన్వాడి టీచర్లు నిర్వహించే బి ఎల్ ఓ విధులు, తదిత అంశాలపై జిల్లా కలెక్టర్ సమీక్షించారు. సమావేశం అనంతరం జిల్లా కలెక్టర్ పోషణ అభియాన్ పై రూపొందించిన వాల్ పోస్టర్లను విడుదల చేశారు.స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ టి. పూర్ణచంద్ర, జిల్లా సంక్షేమ అధికారి సక్కుబాయి, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి పుట్ల శ్రీనివాస్, జెడ్పి సీఈవో ప్రేమ్ కరణ్ రెడ్డి, జిల్లా గిరిజన సంక్షేమ ఇన్చార్జి అధికారి రాజ్ కుమార్, జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి రమేష్, డిపిఓ మురళి, మెప్మా పీడీ కరుణాకర్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.