– కిక్కిరిసిన బస్టాండులు
నవతెలంగాణ-ఆసిఫాబాద్
బుధవారం నుండి దసరా సెలవులు ప్రారంభం అవుతున్న నేపథ్యంలో జిల్లాలోని అన్ని పాఠశాలలకు ఈనెల 14 వరకు రాష్ట్ర ప్రభుత్వం సెలవులు ప్రకటించడంతో జిల్లా కేంద్రంలోని హాస్టల్లో విద్యార్థులు ఇంటిదారి పట్టారు. దీంతో జిల్లా కేంద్రంలోని రహదారులు రద్దీగా కనిపించాయి. విద్యార్థులను తీసుకువెళ్లడానికి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి తల్లిదండ్రులు జిల్లా కేంద్రానికి చేరుకోవడంతో ఎక్కడ చూసిన విద్యార్థుల సందడి కనిపించింది. సాయంత్రం వరకు జిల్లా కేంద్రంలోని అన్ని హాస్టల్స్ ఖాళీగా కనిపించాయి. ఇదే సందర్భంలో వివిధ ప్రాంతాలకు వెళ్లే బస్సులు జనాలతో కిక్కిరిసిపోయాయి. ఇప్పటికే మహాలక్ష్మి పథకం ప్రవేశపెట్టిన తర్వాత ఆక్యుఫెన్సీ రేషియో పెరగడంతో పాటు కొన్ని సందర్భాలలో బస్సులలో కాలు పెట్టే పరిస్థితి లేక అనేక మంది ప్రయాణికులు బస్టాండ్ లో అలాగే ఎదురు చూడాల్సి వస్తుంది. మంగళవారం పరిస్థితి మరింత దారుణంగా మారింది. పెద్ద ఎత్తున తల్లిదండ్రులు విద్యార్థులు బస్టాండ్‌కు చేరుకోవడంతో సరిపోయినన్ని బస్సులు లేకపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడాల్సి వచ్చింది. ఆర్టీసీ అధికారులు అదనపు బస్సులు ఏర్పాటు చేసినప్పటికీ ఒకేసారి రద్దీ పెరగడంతో వారు కూడా చేసేదేమీ లేకుండా పోయింది. ఏది ఏమైనా దసరా సెలవులు రావడంతో జిల్లా కేంద్రంలో మంగళవారం ముందస్తుగానే పండగ వాతావరణం కనిపించింది.