విద్యార్థి జీవితం కొత్తదనానికి, అన్వేషణలకు సమయం. ఈ దశలో విద్య, భవిష్యత్‌పై దృష్టి పెట్టడమే కాదు, సత్సంబంధాలు, ప్రేమ వంటి భావోద్వేగాలు కూడా వారి గుండెకు చేరువ అవుతాయి. ప్రేమ అనేది అనుభవించాల్సిన విలువైన భావన అయినప్పటికీ, అది విద్యార్థుల జీవితంలో ఎలా ప్రభావం చూపుతుందనేది చాలా కీలకం.
అనుజా, ఒక ప్రఖ్యాత కళాశాలలో ఇంజినీరింగ్ విద్యార్థిని. ఆమె ఎప్పుడూ తన విద్యలో అంకితభావంతో ఉంటూ, మెరుగైన ర్యాంకుల కోసం కృషి చేస్తుంది. ఒక సారి ఆమె స్నేహితుడు రాహుల్‌తో ప్రేమలో పడుతుంది. మొదట్లో ఇది ఆమెకు ఆనందంగా, సంతోషంగా అనిపిస్తుంది.
ప్రేమలో పడిన అనుభవం : అనుజా ప్రేమ అనుభవాన్ని ఆస్వాదిస్తూ, రోజువారీ జీవితంలో తన ఆనందాన్ని కలిపేసుకుంది. రాహుల్ కూడా ఆమెను ప్రేమతో గౌరవిస్తూ, ఆమె కష్టాలను అర్థం చేసుకునే వ్యక్తి. ఇద్దరూ కలసి ఎన్నో మంచి సందర్భాలను గడిపారు. కానీ కాలక్రమేణా, ప్రేమలోని భావోద్వేగాలు అధికమై, అనుజా తన చదువుపై దృష్టి తగ్గించింది. ఎక్కువ సమయం రాహుల్‌తో గడపడం, చదువుకు దూరం కావడం ఆమె అకాడెమిక్ పనితీరు మీద ప్రతికూల ప్రభావం చూపింది. ఫలితంగా పరీక్షల్లో తక్కువ మార్కులు వచ్చి, ఆత్మవిశ్వాసం కూడా తగ్గిపోయింది.
అప్పుడు ఆమె తల్లి దండ్రులు నా దగ్గరకు తీసుకు వచ్చారు. తల్లిదండ్రులకు, రాహుల్‌కి ఏం చేయాలో చెప్పాను. రాహుల్ నేను చెప్పింది అర్థం చేసుకుని, అనుజాకు మద్దతు ఇచ్చాడు. అతను ఆమెను తిరిగి తన గమ్యానికి దారితీసేలా చేసాడు.
అనుజా తన జీవితంలో ప్రేమ, విద్య రెండింటినీ సమానంగా, సమర్థవంతంగా నిర్వహించడం నేర్చుకుంది. ప్రేమ వల్ల ఆమె బలహీనం కాకుండా, బలంగా తయారయ్యింది. చివరికి, ఆమె విద్యలో తిరిగి మంచి ఫలితాలు సాధించి, ప్రేమలో విజయవంతం అయ్యింది.
నేటి విద్యార్థుల జీవితం చాలా బిజీగా, ప్రెషర్‌తో నిండిపోయింది. ప్రేమ అనే భావన విద్యార్థుల జీవితంలో కొత్త అనుభవాలను తెస్తుంది. కానీ ప్రేమ గురించి ఏకపక్షమైన అభిప్రాయాలు, సాంప్రదాయ భావనలు ఉండటం వల్ల కొందరు విద్యార్థులు ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయి, తమ విద్యాభ్యాసం పట్ల నిర్లక్ష్యం చూపుతారు.
ప్రేమ అనేది సహజమైన భావన. ఇది ప్రతి మనిషిలోనూ ఉంటుంది. విద్యార్థులయినప్పటికీ ప్రేమను ఆస్వాదించడం వారి హక్కు. అయితే ప్రేమ వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దడంలో సహకరించాలి, అడ్డంకిగా మారకూడదు.
సమయస్ఫూర్తి : ప్రేమలో పడినప్పుడు విద్యార్థులు తమ ప్రధాన బాధ్యతలను మరచిపోకూడదు. ప్రేమ భావన మనసుకు తృప్తి ఇవ్వవచ్చు, కానీ అది విద్యకు ఆటంకం కాకుండా చూసుకోవాలి. విద్యార్థులు అతి ఆలోచనలకు లోనుకాకుండా సమయస్ఫూర్తితో వ్యవహరించాలి. ప్రేమ ఒక ప్రేరణగా, మార్గదర్శకంగా ఉంటే, అది విద్యలోనూ, జీవితంలోనూ మంచి ఫలితాలను తెస్తుంది.
సమతుల్యం: ప్రేమ, చదువు రెండింటినీ సమతుల్యంగా నిర్వహించడం అనేది చాలా అవసరం. ఏ అంశంలోనైనా అతిగా దృష్టి పెట్టడం, ఇతర అంశాన్ని నిర్లక్ష్యం చేయడం సమస్యలకు దారి తీస్తుంది. ప్రేమను అనుభవిస్తూనే, చదువుపై దృష్టి పెట్టడం ద్వారా రెండు దశల్లోనూ మంచి ఫలితాలను పొందవచ్చు.
ప్రాధాన్యతలు నిర్ధారించడం : ప్రేమను జీవితంలో ఒక భాగంగా స్వీకరించాలి, కానీ అది మీ ప్రాధాన్యతలు మార్చకుండా ఉండాలి. విద్య, భవిష్యత్ లక్ష్యాలు, వ్యక్తిత్వ వికాసం మీ మొదటి ప్రాధాన్యతలుగా ఉండాలి. ప్రేమ మనల్ని మానసికంగా సమర్థవంతంగా చేయడానికి సహాయపడాలి, కానీ మీ అభివృద్ధికి అడ్డు కాకూడదు.
భావోద్వేగాలపై నియంత్రణ : ప్రేమలో ఉండటం అనేది భావోద్వేగాలను తీవ్రంగా ప్రభావితం చేసే అనుభవం. విద్యార్థులు ఈ భావోద్వేగాలను గుర్తించి, వాటిపై నియంత్రణ సాధించాలి.
ద్వంద్వాల నివారణ : ప్రేమలో విఫలమైతే నిరాశ చెందకుండా, ఆ అనుభవాన్ని బలంగా తీసుకోవాలి. ప్రేమలో దారి తప్పడం వల్ల విద్యకు, భవిష్యత్‌కు నష్టం కలగకుండా చూడాలి. ప్రతి అనుభవం ఒక పాఠంగా, జీవన నైపుణ్యంగా మార్చుకోవాలి.
సమాచారాన్ని పంచుకోవడం :
ప్రేమ గురించి సందేహాలుంటే, లేదా మనసులో అనుమానాలు ఉంటే, తల్లిదండ్రులు, గురువుల వంటి అనుభవజ్ఞుల సహాయం తీసుకోవడం మంచిది. వారు ఇచ్చే సలహాలు, మార్గదర్శకాలు మీకు ప్రేమను, విద్యను సమర్థవంతంగా నిర్వహించడంలో సహాయపడతాయి.
అపేక్షలు తగ్గించుకోవడం : ప్రేమలో ఉండటం వల్ల అపేక్షలు, ఆశలు పెరగవచ్చు. కానీ అవి సుస్థిరంగా ఉండాలి. గమనించాల్సిన విషయం ఏమిటంటే, ప్రస్తుత దశలో ముఖ్యమైనది మీ అభ్యాసం, వ్యక్తిత్వ వికాసం.
విజయాన్ని లక్ష్యం చేసుకోవడం: ప్రేమ మిమ్మల్ని విజయం వైపు నడిపించాలి, దారి తప్పించకూడదు. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులే కాకుండా మీరు ప్రేమిస్తున్న వ్యక్తి కూడా మీ విజయాన్ని కోరుకోవాలి. ఒకరికి మరొకరు మద్దతుగా ఉండడం ద్వారా, చదువులో, వ్యక్తిత్వంలో మంచి ఫలితాలను పొందవచ్చు.
చివరగా… ప్రేమ ఒక అద్భుతమైన భావన. కానీ అది విద్యలో ఏ ఆటంకం కాకుండా, బలంగా నిలబడేలా ఉండాలి.
డా|| హిప్నో పద్మా కమలాకర్, 9390044031
కౌన్సెలింగ్, సైకో థెరపిస్ట్, హిప్నో థెరపిస్ట్