విద్యార్థులు పాఠశాలకు వెళ్లే సమయంలో తప్పనిసరిగా బస్సులు నడపాలి

Students must ride buses while going to school– ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ఉపాధ్యక్షులు శ్రీకాంత్‌
నవతెలంగాణ-షాద్‌నగర్‌
విద్యార్థులు పాఠశాలకు వెళ్లే సమయాల్లో బస్సులు నడపాలని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ఉపాధ్యక్షులు శ్రీకాంత్‌ అన్నారు. శనివారం షాద్‌నగర్‌ డివిజన్‌ ఎస్‌ఎఫ్‌ఐ కమిటీ ఆధ్వర్యంలో బస్‌ డిపో మేనేజర్‌కు, ఎస్‌ఐకి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత పదేండ్ల బీఆర్‌ఎస్‌ పాలనలో విద్యార్థులు ఎన్నో అవస్థలు ఎదుర్కొన్నారనీ, అలాంటి పరిస్థితి కాంగ్రెస్‌ హయాంలో రాకుండా చూడాలని అన్నారు. ఇప్పటికి కూడా కొన్ని గ్రామాలకు సకాలంలో బస్సులు వెళ్లకపోవడంతో విద్యార్థులు అల్లాడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. మరికొన్ని ప్రాంతాల్లో పాఠశాలలు, కళాశాలల సమయానికి బస్సులు రాకపోవడంతో ప్రయివేట్‌ వాహనాలపై ఆధారపడాల్సి వస్తుందనీ, దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆర్థికంగా నష్టం జరుగు తుందన్నారు. బస్సులు సమయానికి రాకపోవడంతో కళాశాలలకు, పాఠశాలలకు సకాలంలో వెళ్లకపోవడంతో పాటు, పాఠాలు మిస్‌ అవుతు న్నాయని తెలిపారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి, కళాశాలలకు, పాఠశాలల సమయానికి అనుగుణంగా బస్సులను ఏర్పాటు చేయాలని కోరారు. లేనియేడలా ప్రభుత్వానికి వ్యతిరేకంగా విద్యార్ధులతో పెద్ద ఎత్తున ఉద్యమానికి సిద్ధమవుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ డివిజన్‌ కమిటీ సభ్యులు సాయి, భగత్‌ సింగ్‌, శివ, శ్రీశాంత్‌, కాలేజ్‌ విద్యార్థులు లహరి, మానస, శశికల తదితరులు పాల్గొన్నారు.