విద్యార్థులకు మెరుగైన విద్యనందించాలి

విద్యార్థులకు మెరుగైన విద్యనందించాలి– ఐటీడీఏ పీఓ ఖుష్బుగుప్తా
– పలు ఆశ్రమ పాఠశాలల తనిఖీ
– విధుల పట్ల నిర్లక్ష్యం వహించిన
– అనార్‌పల్లి పీజీహెచ్‌ఎంకు షోకాజు నోటీసు
నవతెలంగాణ-కెరమెరి
ఆశ్రమ పాఠశాలల విద్యార్థులకు మెరుగైన విద్యనందించాలని ఐటీడీఏ పీఓ ఖుష్బు గుప్తా ఉపాధ్యాయులను ఆదేశించారు. ఆశ్రమ ఉన్నత పాఠశాల హాట్టి, అనార్‌పల్లితో పాటు కెరమెరి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, అంగన్‌వాడీ కేంద్రాన్ని పీఓ ఆకస్మికంగా సందర్శించారు. విద్యార్థులకు అందిస్తున్న విద్య, వైద్యం, భోజనంపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆశ్రమ పాఠశాల ఉపాధ్యాయుల హాజరు, స్టాక్‌ రికార్డులను పరిశీలించారు. ఈ సందర్బంగా పీఓ మాట్లాడుతూ విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు ప్రతిరోజూ మెనూ ప్రకారం పోషక విలువలు గల ఆహారాన్ని అందించాలని సూచించారు. సబ్జెక్టుల వారీగా విద్యార్థులకు అర్ధమయ్యే రీతిలో విద్యాబోధన చేయాలన్నారు. వసతి గృహాలు పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా నిత్యం పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టాలన్నారు. ప్రతిరోజు వంటగది, స్టోర్‌ రూమ్‌, తాగునీరు, మరుగుదొడ్లు శుభ్రంగా ఉండేలా తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అనంతరం తరగతి గదిలో విద్యార్థులకు పాఠాలు భోదించారు. సబ్జెక్టుల వారీగా విద్యార్థులను ప్రశ్నలు అడిగి తెలుసుకున్నారు. ప్రతి విద్యార్థికి చదవడం, రాయడం తప్పనిసరిగా రావాలన్నారు. విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యహరిస్తున్న అనర్‌పల్లి పీజీహెచ్‌ఎంకు షోకాజు నోటీసు జారీ చేశారు. వర్షాల నేపథ్యంలో దోమల వలన వ్యాపించే డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులు ప్రబలకుండా, వసతి గృహ పరిసరాలలో వర్షపు నీరు నిలువకుండా చూడాలని ఆదేశించారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు ప్రేందాస్‌, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.