
– కేజీబీవీ పాఠశాలను తనిఖీ చేసిన అధికారులు
నవతెలంగాణ – పెద్దవంగర: విద్యార్థులకు మంచి శుచికరమైన భోజనం అందించాలని జిల్లా సహకార అధికారి, మండల స్పెషల్ ఆఫీసర్ వెంకటేశ్వర్లు అన్నారు. సోమవారం చిన్నవంగర కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని తహశీల్దార్ వీరగంటి మహేందర్, ఎంపీడీవో వేణుమాధవ్ తో కలిసి సందర్శించారు. స్టోర్ రూమ్, కిచెన్, ప్లే గ్రౌండ్, స్టోర్ రూమ్ లో నిల్వ ఉంచిన సన్న బియ్యం, ఇతర సరుకుల నాణ్యతను, విద్యార్థుల కోసం వండిన భోజనాన్ని వారు పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఆహార పదార్థాలు, భోజనం వండేందుకు వినియోగించే పదార్థాలు కలుషితం కాకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. విద్యార్థినుల ఆరోగ్య పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని, క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు జరిపించాలన్నారు. విద్యార్థినులతో మాట్లాడి, వారికి అందిస్తున్న భోజన, వసతి సదుపాయాలు, విద్యా బోధన, రోజువారీ దినచర్య గురించి ఆరా తీశారు. చక్కగా చదువుకుని ఉన్నత స్థానాలు అధిరోహించాలని సూచించారు. ఈ సందర్భంగా ఆయన పాఠశాల రికార్డులను తనిఖీ చేసి, ఉపాధ్యాయులకు పలు సూచనలు చేశారు.