విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో బోధించాలి

– మండల నోడల్ ప్రధానోపాధ్యాయుడు శ్రీనివాస్
నవతెలంగాణ – పెద్దవంగర
ఉపాధ్యాయులు విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో సులభమైన పద్ధతిలో బోధించాలని మండల నోడల్ ప్రధానోపాధ్యాయుడు బుధారపు శ్రీనివాస్ అన్నారు. పెద్దవంగర కాంప్లెక్స్ పరిధిలోని కాన్వాయిగూడెం ప్రాథమిక పాఠశాల, పోచంపల్లి ప్రాథమికోన్నత పాఠశాలను ఆయన మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలల్లోని పలు రిజిస్టర్లు, రికార్డులను, ఉపాధ్యాయుల బోధన తీరును పరిశీలించి, పలు సూచనలు చేశారు. విద్యార్థులతో మాట్లాడి, వారి అభ్యాసన సామర్ధ్యాలను తెలుసుకున్నారు. అనంతరం శ్రీనివాస్ మాట్లాడుతూ.. పాఠ్యాంశాల బోధనలో ప్రతి ఉపాధ్యాయుడు బోధన సామాగ్రిని వినియోగించాలన్నారు. ప్రతి విద్యార్థికీ చదవడం, రాయడం, గుణితాలు, సృజనాత్మకత నేర్పించేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య అందుతుందని, పాఠశాలల బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, సీఆర్పీ రమాదేవి తదితరులు పాల్గొన్నారు.