– స్వచ్ఛంద సంస్థల సహకారంతో జిల్లాను అభివృద్ధి చేస్తా : పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క
– మంత్రి సీతక్కకు సమగ్ర శిక్షా ఉద్యోగుల వినతి
– ట్రాన్స్‌జెండర్ల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యత
నవతెలంగాణ-ములుగు
రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం కేటాయించే నిధులతో సరిపోదని, స్వచ్ఛంద సంస్థలు, పలు కార్యక్రమాల ద్వారా అభివృద్ధి సాధించుకోవాలని పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క అన్నారు. బుధవారం ములుగు జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ హాల్‌లో క్వాల్ కమ్ కంపెనీ, పాఠశాలల యాజమాన్యం సంయుక్తంగా 9, 10వ తరగతి విద్యార్థులకు ఇంగ్లీష్, గణితం, సైన్స్ పాఠాలను బోధించే అధ్యాపకులకు, ప్రధానోపాధ్యాయులకు బుధవారం శిక్షణా తరగతులను నిర్వహించారు. జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్, అదనపు కలెక్టర్ జి.మహేందర్, ఐటీడీఏ పీవో చిత్రా మిశ్రా, ప్రిన్సిపాల్ ఎన్‌కైనర్, క్వాల్‌కామ్ సుధీర్‌కుమార్ సుంకర, ప్రోగ్రామ్ డైరెక్టర్ శ్రద్ధా ఝా, హెడ్-ప్రోగ్రామ్ క్వాలిటీ ఇంప్లిమెంటేషన్ స్పెషలిస్ట్ నేహారాణతో కలిసి సీతక్క పుస్తక ఆవిష్కరణ చేసి తరగతులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాబోధన చేసే ఉపాధ్యాయులు నూతన పరిజ్ఞానంతో విద్యా బోధన చేస్తే విద్యార్థులు ఉన్నత శిఖరాలకు ఎదుగుతారని సూచించారు. గ్రామీణ ప్రాంతంలోని విద్యార్థులకు నూతన పరిజ్ఞానంతో విద్యను బోధించడానికి ఉపాధ్యాయులకు స్వచ్ఛంద సంస్థల వారు శిక్షణా శిబిరం ఏర్పాటు చేయడం ఆశించదగ్గ విషయమని అన్నారు. మూడు రోజులపాటు జరిగే ఈ తరగతులను ములుగు మండలంలోని బండారుపల్లి, మదనపల్లి, వెంకటాపూర్ మండలంలోని జవహర్ నగర్ గ్రామాల్లోని పాఠశాలల్లో గణితం, ఇంగ్లీష్, సైన్స్ పాఠ్య పుస్తకాలపై ఢిల్లీ అధికారులు శిక్షణా తరగతులు నిర్వహించనున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మెన్ బానోతు రవి చందర్, డిఈఓ పాణిని, మేనేజర్ లీడర్‌షిప్, కమ్యూనిటీ ప్రోగ్రామ్ హితేష్ దశభయ, టెక్నికల్ ప్రాజెక్ట్ ఆఫీసర్ మిహిర్ పాండా,20 పాఠశాలలు చెందిన ప్రధానోపాధ్యాయులు, ఆయా పాఠ్యపుస్తకాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సమగ్ర శిక్షా ఉద్యోగులు మంత్రి సీతక్కను జిల్లా కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్‌లో కలిసి వినతిపత్రం అందజేశారు. వెంటనే తమ ఉద్యోగాలను రెగ్యులర్ చేయాలని కోరారు.
ట్రాన్స్‌జెండర్ల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యత
ములుగు జిల్లా కేంద్రంలోని ఏరియా ఆస్పత్రిలో ట్రాన్స్ జెండర్‌లకు ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన మైత్రి ట్రాన్స్ ఉమెన్ క్లినిక్‌ను జిల్లా కలెక్టర్, ఐటీడీఏ పీఓ, గ్రంథాలయ సంస్థ చైర్మెన్‌లతో కలిసి మంత్రి ప్రారంభించారు. ఐటీడీఏ ఏటూరునాగారం ద్వారా మంజూరైన (6) ఈఎంఆర్‌ఐ 108 సర్వీస్ అంబులెన్స్‌లనూ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. టాన్స్‌జెండర్ల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, వారి అభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు తెలిపారు.
రాష్ట్రాన్ని ఆరోగ్యవంతమైన తెలంగాణ సమాజంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో వైద్య రంగానికి ప్రభుత్వం ఎనలేని ప్రాధాన్యత ఇస్తోందని అన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ దివాకర టీఎస్, డీఎంఅండ్‌హెచ్‌ఓ గోపాలరావు, ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్ జగదీశ్వర్ , జిల్లా సంక్షేమ శాఖ అధికారి శిరీష, ఐటీడీఏ జిల్లా ఉప వైద్యారోగ్య అధికారి డాక్టర్ కె. క్రాంతి కుమార్, ఐటీడీఏ స్టాటిస్టికల్ ఆఫీసర్ రాజ్ కుమార్, ప్రోగ్రామ్ మేనేజర్ మహేందర్, ట్రాన్స్ జెండర్ సంఘం జిల్లా నాయకురాలు కల్పన, ఇందు ట్రాన్స్ జెండర్ ప్రతినిధులు, మైత్రి ట్రాన్స్ క్లినిక్ డాక్టర్లు పాల్గొన్నారు.