విద్యార్థులు చదువుతో పాటు క్రీడాల్లో రాణించాలని, ఆ దిశగా వారిని ప్రోత్సహించాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అన్నారు. బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బీసీ వసతి గృహ విద్యార్థుల జిల్లా స్థాయి క్రీడ పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. శనివారం క్రీడా పోటీలకు అదనపు కలెక్టర్ శ్యామల దేవితో కలిసి కలెక్టర్ ముఖ్య అథితిగా హాజరయ్యారు. ముందుగా క్రీడాకారులను పరిచయం చేసుకుంటూ జట్ల మధ్య టాస్ వేసి పోటీలను ప్రారంభించారు. అనంతరం ఆయన కూడా పలు క్రీడాలు ఆడి విద్యార్థులను ప్రోత్సహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజర్షి షా మాట్లాడుతూ… గతంలో కేవలం రెసిడెన్షియల్ పాఠశాలల్లోనే క్రీడ పోటీలు జరిగేవన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు బీసీ వెల్ఫర్ వసతి గృహాల్లో కూడా క్రీడ పోటీలు నిర్వహించడం సంతోషకరమన్నారు. ఈ పోటీలతో విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలతో పాటు క్రమశిక్షణ, పోటీ తత్వం పెరుగుతుందన్నారు. దీని ద్వారా వీరు భవిష్యత్తులో రాణించే అవకాశాలుంటాయన్నారు. అదే విధంగా ప్రభుత్వం ఇటీవల డైట్ చార్జీలను పెంచడం పట్ల విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారన్నారు. వసతి గృహాలను తనిఖీ చేసిన సమయంలో విద్యార్థులో సంతోషిస్తు ధన్యవాదలు తెలుపుతున్నారన్నారు. విద్యార్థులకు మంచి భోజనం అందించేందుకు గాను ప్రభుత్వం ఫుడ్ సెఫ్టి కమిటీలను ఆయా విద్యా సంస్థల్లో నియమించిందన్నారు. త్వరలో వంట మనిషితో పాటు నర్సు, ఉపాధ్యాయులకు ఆహార భద్రత అధికారులతో శిక్షణాలు ఇస్తామన్నారు. రుచి, పరిశుభ్ర ఆహారం ఎలా అందించాలో వివరిస్తారన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ వెల్ఫర్ అధికారి రాజలింగు, డీవైఎస్ఓ వెంకటేశ్వర్లు, వసతి గృహాల పీఈటీలు, పీడీలు, కోచ్లు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.