విద్యార్థులు పరిశుభ్రతను మెరుగుపరచుకోవాలి

– విద్యార్థులకు నులిపురుగుల మందుల పంపిణీ 
– మున్సిపల్ ఛైర్మన్ ఆకుల రజిత వెంకన్న 
నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్ 
ఆరోగ్యమే మహాభాగ్యమని ఆరోగ్యంగా ఉంటేనే ఏదైనా సాధించవచ్చునని, విద్యార్థులు పరిశుభ్రతను మెరుగుపరచుకోవలని హుస్నాబాద్ మున్సిపల్ చైర్మన్ ఆకుల రజిత వెంకన్న అన్నారు. గురువారం హుస్నాబాద్ పట్టణంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం లో భాగంగా  విద్యార్థులకు నులిపురుగుల మందులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ రజిత మాట్లాడుతూ శరీరంలోని పేగుల్లో చేరిన నులిపురుగులకు ఒక్క ఆల్‌బెండజోల్‌ మాత్రతో చెక్‌ పెట్టవచ్చని సూచించారు. పిల్లల్లో ఎక్కువగా నులిపురుగులు ఉంటాయని,నులిపురుగుల వల్ల రక్తహీనత, నీరసం, కడుపులోనొప్పి కలగడమే కాకుండా విద్యార్థులు చదువులో వెనుకబడిపోయే అవకాశం ఉందన్నారు. రెండు సంవత్సరాల నుండి 18 సంవత్సరాలు కలిగిన యువతీ యువకులు ఆల్‌బెండజోల్‌ మాత్రలు తీసుకొని నులిపురుగులను నివారించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ అనిత , కమిషనర్ మల్లికార్జున్, డిప్యూటీ డిఎంహెచ్వో డాక్టర్ ప్రభాకర్ డాక్టర్ నికిత తదితరులు పాల్గొన్నారు.