
నవతెలంగాణ – భువనగిరి రూరల్
లక్ష్యాలను మధ్యలో వదిలి వేయకుండా గమ్యం చేరుకోవాలని, జిల్లా కలెక్టర్ హనుమంతు కే జెండగే విద్యార్థినీ విద్యార్థులకు సూచించారు.
శనివారం నాడు మోత్కూర్ వై జె గార్డెన్స్ లో ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో వసతి గృహ విద్యార్థులకు నిర్వహించిన ప్రేరణ, అవగాహన తరగతుల కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై, మాట్లాడారు. విద్యార్థులు తాము నిర్ణయించుకున్న పనులను, లక్ష్యాలను మధ్యలో వదిలి వేయవద్దని, చిన్న చిన్న సమస్యలను అతిగా ఊహించుకోవద్దని, మీరు పైకి రావాలంటే మీలోని నెగెటివ్ ఆలోచనలు పక్కకు పెట్టి పాజిటివ్ ఎనర్జీ బయటపెట్టాలని, అప్పుడే సక్సెస్ అవుతారని, చదువు మీదనే శ్రద్ధ ఉండాలని, రివిజన్ పై దృష్టి పెట్టాలని, హార్డ్ వర్క్ కోసం ప్రయత్నించాలని అన్నారు. ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన ఎలాన్ మాస్క్ తన కంపెనీలో లైఫ్ స్కిల్స్ ఉన్నవారినే సెలెక్ట్ చేస్తారని, వచ్చే పది సంవత్సరాలలో చేసే పనులు నిర్ణయించుకొని వాటిని ఒక సంవత్సరంలోనే చేయాలి అనే పట్టుదల ప్రదర్శిస్తానని, వాటిలో కనీసం కొన్ని అయినా సాధిస్తానని అన్నారని తెలిపారు. మీరు కూడా లక్ష్యాలను ఏర్పాటు చేసుకొని, ప్రణాళికతో ఆచరణలో పెట్టాలని అన్నారు. ఒలింపిక్స్ లో 28 గోల్డ్ మెడల్స్ సాధించిన అమెరికన్ స్విమ్మర్ మైఖేల్ ఫేల్ప్స్ తన ఏడు సంవత్సరాల వయసులోనే స్విమ్మింగ్ మొదలుపెట్టారని, తన గమ్యస్థానం చేరుకోవడానికి చాలా కష్టపడ్డాడని, చేయి విరిగినా ప్రాక్టీస్ ఆపకుండా ముందుకు సాగారని, ప్రపంచ రికార్డులను బ్రేక్ చేశారని, లక్ష్యం సాధించారని అన్నారు. మన జీవితంలో కూడా ఏ పనిని మధ్యలో వదిలి వేయకుండా గమ్యస్థానం చేరుకోవాలని, చిన్న సమస్యలను కూడా అతిగా ఊహించుకోవద్దని, పరీక్షలు వస్తున్నందున బాగా చదివి తల్లిదండ్రుల ఆశయాలను సాధించాలని అన్నారు. అనంతరం డిప్యూటీ పోలీస్ కమిషనర్ రాజేశ్ చంద్ర మాట్లాడుతూ స్పీడ్ పెరుగుతున్న ఈ కాలంలో మనిషికి అసహనం పెరుగుతున్నదని దీనిని గమనించాలని అన్నారు, ఇంటర్నెట్లో మంచి చెడు రెండు ఉంటాయని, అన్నీ నిజం కావని, కాలాన్ని మంచిగా వినియోగించుకోవాలని, పది మందితో మాట్లాడాలని, విషయ పరిజ్ఞానం పెంచుకొంటే జీవితంలో పనికొస్తుందని, మనకు తెలియని చాలా విషయాలు ఆటలు నేర్పిస్తాయని, తద్వారా మంచి ఫిట్నెస్, ఎనర్జీ, ఏకాగ్రత, డిసిప్లిన్ వస్తుందని, నాయకత్వ లక్షణాలు పవరుగుతాయని, ఓటమిని కూడా జీర్ణించుకునే శక్తి వస్తుందని, గెలుపు ఓటములు కాదు, ఆట ఆడిన విధానం గొప్పదని అన్నారు. ప్రతి ఒక్కరూ కాలానికి గౌరవం ఇవ్వాలని, మిమ్మల్ని మీరు గౌరవించుకోవాలని, మీ మీద మీకు నమ్మకం ముఖ్యమని అన్నారు. జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జి వీరారెడ్డి మాట్లాడుతూ వైఫల్యాలను సరిచేసుకొని జీవితంలో ముందుకెళ్లాలని, మీ టీచర్లు చెప్పిన దానిని జాగ్రత్తగా విని మళ్ళీ మళ్ళీ చదవాలని, దేవుడు ఎన్నో అవకాశాలను సృష్టించారని, ఎవరూ ఎక్కువ కాదు తక్కువ కాదని, భగవంతుని దృష్టిలో అందరూ సమానమేనని అన్నారు. ఇంపాక్ట్ వ్యవస్థాపకులు, ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు గంప నాగేశ్వరరావు కార్యక్రమంలో విద్యార్థినీ విద్యార్థులు లక్ష్యసాధనలో సాధించవలసిన విషయాల పట్ల అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి కే నారాయణరెడ్డి, జిల్లా బీసీ సంక్షేమ అధికారి యాదయ్య, జిల్లా సాంఘిక సంక్షేమ అభివృద్ధి అధికారి జయపాల్ రెడ్డి, ఉపాధ్యాయులు, వసతి గృహాల వార్డెన్లు పాల్గొన్నారు.