విద్యార్థులు పట్టుదలతో చదివి పేరు ప్రఖ్యాతలు సాధించాలి

– కేజీబీవీ స్పెషల్ ఆఫీసర్ వి.పద్మ
– ప్రెస్ క్లబ్ తరుపున విద్యార్థినికి డిక్షనరీ బహూకరణ
– నవతెలంగాణ – ఆళ్ళపల్లి
విద్యార్థులు పట్టుదలతో చదివి కన్న తల్లిదండ్రులు, బోధించిన ఉపాద్యాయులు గర్వపడేలా మంచి పేరు ప్రఖ్యాతలు సాధించాలని స్థానిక కేజీబీవీ స్పెషల్ ఆఫీసర్ వి.పద్మ పిల్లలకు సూచించారు. ఆదివారం ఇటీవల విడుదలైన పదో తరగతి పరీక్షా ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ చూపి మండలంలో టాప్ ర్యాంక్ సాధించిన మండల కేంద్రానికి చెందిన మలిపెద్ది ప్రణవి అనే విద్యార్థినికి ప్రోత్సాహకంగా స్థానిక కేజీబీవీ స్పెషల్ ఆఫీసర్ వి.పద్మ చేతుల మీదుగా ప్రెస్ క్లబ్ సభ్యులు డిక్షనరీ అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మా కేజీబీవీలో చదివిన ప్రణవి పదో తరగతి పరీక్షా ఫలితాల్లో మండలంలో ప్రథమ స్థానం సాధించడం గర్వంగా ఉందన్నారు. ర్యాంక్ సాధించే క్రమంలో విద్యార్థిని ప్రణవి కృషి, విద్యాలయం సిబ్బంది, తన తల్లి, కుటుంబ సభ్యుల కృషి ఎంతో ఉందన్నారు. ప్రతి విద్యార్థి జీవితం విజయవంతం కావడంలో తల్లిదండ్రులు, గురువుల ఎనలేని కృషి ఉంటుందని చెప్పారు. మంచి నడవడిక కలిగి ప్రణాళిక బద్ధంగా చదివితే ప్రతి ఒక్కరూ సమాజంలో ఉన్నత స్థాయికి చేరుకోవచ్చని సూచించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థిని తల్లి ఎం.మమత, కేజీబీవీ టీచర్లు కె.వసంత, కె.కుమారి, స్థానిక ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు మహమ్మద్ ఫయీమ్(నవతెలంగాణ), ఉపాధ్యక్షుడు తాళ్లపల్లి శేఖర్ (మనం), సభ్యులు తాళ్లపల్లి శ్రావణ్ (ఆంధ్ర జ్యోతి), నరెడ్ల యోగేందర్ (వి6 వెలుగు), మొహమ్మద్ ఖలీల్ (ప్రజా ప్రతిభ), తాళ్లపల్లి కోటేశ్వరరావు ( పీపుల్స్ డైరీ), తదితరులు పాల్గొన్నారు.