– ఎంఈఓ సయ్యద్ అక్బర్
నవతెలంగాణ-శంకర్‌పల్లి
విద్యార్థులు ఉన్నత లక్ష్యంతో బాగా చదువుకోవాలని శంకర్‌పల్లి మండల విద్యాశాఖ అధికారి సయ్యద్ అక్బర్ అన్నారు. శంకర్‌పల్లి మండలంలోని మోకీలా తండాకు చెందిన సబావత్ దేవి శంకర్‌ల కుమారుడు సబావత్ చందు ఇటీవల నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రకటించిన జేఈఈ అడ్వాన్స్ జాతీయ స్థాయిలో 407 ర్యాంకు (ఎస్టి కేటగిరి) సాధించడం పట్ల శుక్రవారం విద్యార్థిని ప్రోత్సహించి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎంఈఓ మాట్లాడుతూ పేద కుటుంబంలో పుట్టి జేఈఈ అడ్వాన్స్ జాతీయ స్థాయిలో 407 ర్యాంకు సాధించడం అభినందనలు తెలిపారు. తల్లిదండ్రుల సపోర్ట్,ఉపాధ్యాయుల, ప్రోత్సాహం, విద్యార్థుల పట్టుదల వారి ఉన్నత లక్ష్యాలను సాధించుటకు తోడ్పడుతుందన్నారు. జాతీయ స్థాయి ర్యాంకు సాధించిన చందును ఈ సందర్భంగా ప్రాథమిక పాఠశాల కొండకల్ తండాలో ఉపాధ్యాయులు, విద్యార్థులు గ్రామస్తులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రాజశేఖర్ మాట్లాడుతూ కూలి పని చేసే తల్లిదండ్రుల తనయుడు, గిరిజన బిడ్డ జాతీయస్థాయి ర్యాంకు సాధించడం గర్వకారణమన్నారు. భవిష్యత్తులో ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. పాఠశాల ఉపాధ్యాయులు మర్పల్లి అశోక్ మాట్లాడుతూ తొమ్మిదేండ్ల క్రితం మోకీలా తండాకు చెందిన సబావత్ చందు, కొండకల్ తండాకు చెందిన రాథోడ్ శ్రీకాంత్ అనే ఇద్దరు విద్యార్థులను యూసుఫ్ గూడాలో ఉన్న సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న బెస్ట్ అవైలబుల్ స్కూల్లో ఐదోవ తరగతిలో అడ్మిషన్ తీసుకుని, పదోవ తరగతి వరకూ ఆ ఇద్దరి విద్యార్థులు అక్కడే చదువుకుని మంచి మార్కులతో ఉత్తీర్ణులయ్యారని తెలిపారు. ఇంటర్మీడియట్ నారాయణ జూనియర్ కాలేజీలో చదివిన చందు స్వయం కృషితో జేఈఈ అడ్వాన్స్‌లో జాతీయస్థాయిలో 407 ర్యాంకు సాధించడం చాలా సంతోషకరమన్నారు. చందు గిరిజన ఆవాసంలో వికసించిన విద్యా కుసుమని, తాను చిన్నప్పటి నుంచి చక్కటి క్రమశిక్షణ, వినయం విధేయత కలిగి, చదువుపట్ల శ్రద్ధతో ఉండేవాడని వెల్లడించారు. తన సద్గుణాలే తనను జాతీయస్థాయిలో ఉన్నత స్థానంలో నిలవడానికి తోడ్పడినాయని తెలియజేసి, చందు చదువు కోసం వారి తల్లిదండ్రులు పడిన కష్టానికి మంచి ప్రతిఫలం దక్కిందని, భవిష్యత్‌లో మరింత అంకితభావంతో తన లక్ష్యాన్ని చేరుటకు నిరంతర ప్రయత్నం కొనసాగించాలని సూచించారు. మధ్యలో వచ్చే ఆటంకాలను అధిగమిస్తూ, ఉన్నత స్థాయి ఉద్యోగాలైన ఐఏఎస్, ఐపీఎస్ లాంటి ఉద్యోగాన్ని సాధించి, తల్లిదండ్రులకు ఉపాధ్యాయులకు, ఈ ప్రాంతానికి మంచి పేరు తేవాలని చందును శాలువాలతో , పూలమాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థిని తండ్రి శంకర్ నాయక్, కొండకల్ తండా పాఠశాల విద్యార్థులు, గ్రామస్తులు రాథోడ్ మోహన్, రాథోడ్ లక్ష్మణ్, రాథోడ్ వసన్, నూన్సవత్ లోక్య, మూడవత్ శ్రీ జ్యోతి, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.