సంక్షేమ హాస్టల్స్ లో అవస్థలు పడుతున్న విద్యార్థులు….

– ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి శాంతి కుమార్…
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ 
జిల్లా వ్యాప్తంగా ఉన్న సంక్షేమ వసతి గృహాల విద్యార్థుల సమస్యల పరిష్కరించాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఉప్పుల శాంతికుమార్
రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం  అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని ఎస్సి కళాశాల బాలుర వసతి గృహం, ఎస్సి పాఠశాల బాలుర వసతిగృహం, ఎస్టి పాఠశాల  బాలుర వసతి గృహాన్ని సందర్శించి, మాట్లాడారు.  వసతి గృహాల్లో అడుగడుగునా విద్యార్థులను అసౌకర్యాలు వెంటాడుతూ నరక కుపాన్ని తలపిస్తున్నాయని ఆయన అన్నారు.సంక్షేమ వసతి గృహాల నిర్వహణ గాడి తప్పుతూ విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నాయని ఆయన విమర్శించారు. ఏ హాస్టల్ కి వెళ్లిన అరకోర సౌకర్యాలతో విద్యార్థులు కాలం వెల్లదీస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.  జిల్లాలో ఉన్న   హాస్టళ్ళ నిర్వహణ పట్టించుకోవాల్సిన సంబంధిత డీడీలు తమ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని దీంతో విద్యార్థుల సమస్యలు పట్టించుకునే నాధుడే లేడని ఆయన పేర్కొన్నారు.డీ డీలు జిల్లా స్థాయి ఉన్నతాధికారులును సైతం తప్పుదోవ పట్టిస్తూన్నారని,  దీనివలన సంక్షేమం సంక్షోభంలో కురుకు పోయిందని అయన అన్నారు. చలికాలం సమీపించి 15 రోజులు కావస్తున్నా,  విద్యార్థులకు తగిన దుప్పట్లు, దోమతెరలు స్వెటర్స్ అందజేయలేదని,  వారు చలిలో వణుకుతూ కాలం వెల్లదీస్తున్నారని తెలిపారు.  జిల్లా వ్యాప్తంగా అనేక హాస్టల్లో కిటికీలు తలుపులు లేవని ,  విద్యార్థులు తమ ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకుని తమ చదువులు కొనసాగిస్తున్నారని ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి సంక్షేమ హాస్టల్ లో  కనీస సౌకర్యాలు కల్పించి, వార్డెన్ లో స్థానిక హాస్టల్లో ఉండే విధంగా  చర్యలు తీసుకోవాలని,  హాస్టళ్లపై డిడిల పర్యవేక్షణ నిరంతరం ఉండే విధంగా తగు చర్యలు తీసుకోవాలని కోరారు.  సంక్షేమ వసతి గృహాల విద్యార్థులకు పెంచిన మెస్,  కాస్మోటిక్ చార్జీలను తక్షణమే అమలు చేయాలని, చలికాలం సమీపించిన నేపథ్యంలో తక్షణమే విద్యార్థులకు దుప్పట్లు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు.  సంక్షేమ హాస్టల్ విద్యార్థుల సమస్యల పరిష్కరించని ఎడల ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలను ఉదృతం చేస్తామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో. జిల్లా సహాయ కార్యదర్శి మారుపాక లోకేష్ , జిల్లా సమితి సభ్యులు రాంపాక చందు, మహేష్  లు పాల్గొన్నారు.