ఓయూలో విద్యార్థినుల రాస్తారోకో

– అన్నంలో పురుగులు వస్తున్నాయని ఆందోళన
– చీఫ్‌ వార్డెన్‌ లిఖిత పూర్వక హామీ
నవతెలంగాణ-ఓయూ
నాణ్యమైన భోజనం పెట్టడం లేదని, అన్నంలో పురుగులు వస్తున్నాయని హైదరాబాద్‌ ఉస్మానియా యూనివర్సిటీ లేడీస్‌ హాస్టల్‌ 3వ బ్లాక్‌ విద్యార్థినులు మంగళవారం రాస్తారోకో చేశారు. అన్నం ప్లేట్లు పట్టుకుని లేడీస్‌ హాస్టల్‌ ముందు రోడ్డుపై బైటాయించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థినులు మాట్లాడుతూ.. రెండు, మూడు నెలలుగా ఆహారంలో పురుగులు వస్తున్నాయని, నాణ్యత లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని ఆరోపించారు. తాము ఉన్నత చదువుల కోసం ఎంతో ఆశతో గ్రామీణ ప్రాంతాల నుంచి ఓయూకు వచ్చామని చెప్పారు. తమ తల్లుల బంగారం తాకట్టు పెట్టి డబ్బులు ఇస్తే మెస్‌ బిల్‌ కడుతున్నామని వాపోయారు. సరైన తిండి లేక ఇబ్బంది పడుతున్నామన్నారు. అన్నం, కూరల్లో పురుగులు వస్తున్నాయని చాలాసార్లు హాస్టల్‌ డైరెక్టర్‌కు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని చెప్పారు.
ధర్నా చేస్తున్నప్పుడు మాత్రం స్పందిస్తూ.. తమను పట్టుకొని కావాలని, పనిలేక చేస్తున్నారని మాట్లాడటం సరికాదన్నారు. చదువు కోవడానికే సమయం సరిపోవడం లేదని, అలాం టప్పుడు ధర్నా చేయాల్సిన అవసరం తమకేంటని ప్రశ్నిం చారు. సరైన తిండి పెడితే ఎందుకు రోడ్లమీదకొచ్చి కూర్చుంటామని ప్రశ్నించారు. కడుపునిండా తిండి ఉంటే కష్టపడి చదువుకుంటా మన్నారు. హాస్టల్‌ డైరెక్టర్‌ను తొలగించి, నాణ్యమైన ఆహారం అందించాలని డిమాండ్‌ చేశారు. మెనూ అమలు చేయడం లేదని, రెండోసారి కూర, అన్నం అడిగితే డబుల్‌ మెస్‌ బిల్లు వస్తాయని అంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మెస్‌ సిబ్బంది దురుసుగా, అసభ్యకరంగా మాట్లాడుతున్నారని ఆరోపించారు. అనంతరం సమస్యల పరిష్కారానికి చీఫ్‌ వార్డెన్‌ డా.కొర్రెముల శ్రీనివాస్‌, డెరైక్టర్‌ డా.కళ్యాణ లక్ష్మి లిఖిత పూర్వకంగా హామీ ఇవ్వడంతో రాస్తారోకో విరమించారు.