అభ్యాస శైలిని ఒకసారి విశ్లేషించుకోవాలి. వారంలో ఒకటి లేదా రెండుసార్లు ఎక్కువ సమయం చదువుకోగలుగుతున్నారా లేదా రాత్రిపూట ఓ అరగంట చదువుకుంటే చదివినది బాగా గుర్తుంటుందా? రోజులో ఒక నిర్దిష్ట సమయంలో ఎక్కువ ఎఫెక్టివ్‌గా చదవగలుగుతున్నారా? క్లాస్ ముగిసిన వెంటనే చదివితే సబ్జెక్టును మెరుగ్గా అర్థం చేసుకోడానికి వీలవుతుందా? మధ్యమధ్యలో విరామం ఇస్తూ చదివితే బాగా అర్ధమవుతుందా?
ఏ సబ్జెక్ట్ చదవడానికి ఎంత సమయం కేటాయించాలో ప్లాన్ చేసుకోవాలి. అలాగే రోజువారీ ఇతర పనులకు కూడా దృష్టిలో వుంచుకుని సమయం కేటాయించాలి. దీనికోసం డిజిటల్ లేదా పేపర్ క్యాలెండర్ బాగా ఉపయోగపడుతుంది. మీరు వేసుకున్న టైంటేబుల్‌లో అధ్యయనానికి ఎక్కువ సమయం కేటాయించాలి. సిలబస్ ఎంత వుంది? సిలబస్‌లో కొంత పార్ట్ కష్టంగా వుండొచ్చు. అటువంటి భాగాలకి ఎక్కువ సమయం కేటాయించాలి. అసైన్‌మెంట్‌లు, ప్రాజెక్ట్‌వర్క్‌లను షెడ్యూల్ చేయటంలో ఈ టైంటేబుల్ సహాయపడుతుంది.
ఇప్పుడు మీరు చదువుకోవడానికి ఎంత సమయం కావాలి. ఎంత సమయం అందుబాటులో ఉందో అర్ధమవుతుంది. మీరు ప్రతి సబ్జెక్టుకు ఎంత సమయాన్ని వెచ్చిస్తున్నారో, ఏ రోజున ఏ సబ్జెక్టు అధ్యయనం చేస్తున్నారో ప్లాన్ చేయండి. ఉదాహరణకు, సోమ, గురువారాలు గణితానికి, మంగళ, శుక్రవారాలు ఆంగ్లానికి కేటాయించవచ్చు.
మీ షెడ్యూల్ బిజీగా ఉంటే, అధ్యయనం చేయడానికి సమయం వెతకడంలో సృజనాత్మకత ఉండాలి. ఉదాహరణకు, పబ్లిక్/ ప్రైవేట్ ట్రాన్స్‌పోర్టులో పాఠశాలకు వెళ్లినట్లయితే, ఆ సమయాన్ని చదవడానికి ఉపయోగించవచ్చు.
ప్రతి వారం ప్రారంభంలో ఎందుకు అధ్యయనం చేయాలి? ఏం అధ్యయనం చేయాలో నిర్ణయించుకోవాలి. ఫైనల్ పరీక్షకు సిద్ధమవుతున్నారా? బాక్‌లాగ్స్ వున్నాయా? ఇలాంటివన్నీ దృష్టిలో పెట్టుకుని పరీక్షలకు ప్రిపేర్ అవ్వాలి.
చాలామంది ఇప్పుడే పరీక్షలు కాదు కదా, చాలా టైం వుందని చదవడం వాయిదా వేస్తుంటారు. అది తాత్కాలిక ఉత్సాహాన్ని కలిగిస్తుంది. కానీ ఎగ్జామ్స్ టైంలో టెన్షన్ పడాల్సి వస్తుంది. ముందుగా చదవడం వల్ల వల్ల ఎక్కువ సమయాన్ని ఆదా చేసుకోవచ్చు.
ఒకసారి షెడ్యూల్ వేసుకున్నారంటే దానికి కట్టుబడి ఉండాలి. అధ్యయన ప్రణాళికను స్థిరంగా అనుసరించాలి. ప్రతి టర్మ్‌కు తరగతులను మార్చినదానికి అనుగుణంగా ప్లాన్‌ని సర్దుబాటు చేయాలి. ఎలాంటి పరిస్థితుల్లోనూ అధ్యయన ప్రణాళికకు కట్టుబడి ఉండాలి.
ఒకేసారి ఎక్కువ గంటలు కూర్చుని చదువుతుంటే మెదడు వేడెక్కుతుంది. చదివినది బుర్రకి ఎక్కదు. అందుకే మధ్యమధ్యలో చిన్న విరామం తీసుకుంటూ చదవాలి. విరామం మెదడును తాజాగా ఉంచుతుంది.
ఇతర పనులకోసం కేటాయించిన సమయాన్ని వీలైతే కొంత తగ్గించుకుని విశ్రాంతి తీసుకోవచ్చు. దీనివల్ల మైండ్ రిఫ్రెష్ అవుతుంది. వ్యాయామం, ఇతర కళాభిరుచులు, ఫ్రెండ్స్‌తో చర్చించడం వంటివి మెంటల్ రిలీఫ్‌ని ఇస్తాయి.
కొంతమంది విద్యార్థులకి ఫ్రెండ్స్‌తో కలిసి చదువుకోవడం, చర్చించడం వల్ల సబ్జెక్ట్ బాగా గుర్తుంటుంది. చాలా ఉపయోగకరంగా కూడా వుంటుంది.
అధ్యయన ప్రణాళికను ప్లాన్ చేస్తున్నప్పుడే స్నేహితులతో చర్చిస్తే… వారి సలహాలూ పొందొచ్చు. అయితే ఆ స్నేహితులు మీ ప్లానింగ్‌తో, మీ ఆలోచనలతోనే ఉన్నవారై వుండాలి.
అధ్యయన ప్రణాళికను రూపొందించడానికి పెన్, పేపర్, అధ్యయన ట్రాక్, క్యాలెండర్ యాప్‌ని ఉపయోగించొచ్చు. స్టడీ సెషన్‌ను ప్రారంభించి ముగించే సమయాలను రిమైండర్‌లో సెట్ చేయండి. My Study Planner, మరియు myHomework వంటి అనేక స్టడీ ప్లానర్ యాప్‌లు అందుబాటులో ఉన్నాయి. ఇవి మీ అధ్యయన షెడ్యూల్‌కు సహాయపడతాయి.
ప్రతి రోజూ స్నానం, లేవడం, చదవడం, తినడం, పడుకోవడం సమయం ప్రకారం చేయడం వల్ల పరీక్షలు కూడా సమయానికి రాయగలరు.
డా|| హిప్నో పద్మా కమలాకర్
9390044031
కౌన్సెలింగ్, సైకో థెరపిస్ట్,
హిప్నో థెరపిస్ట్