
– భారీగా తరలివచ్చిన ఓయూ విద్యార్థులు
నవతెలంగాణ- ఓయూ
ఉస్మానియా యూనివర్సిటీ సివిల్ సర్వీస్ అకాడమీ డైరెక్టర్ ప్రో. కొండా నాగేశ్వర్, ఆధ్వర్యంలో సెంటర్ లో బుధవారం నిర్వహించిన ఫ్రీ కోచింగ్ ఫర్ సివిల్ సర్వీస్ అండ్ అదర్ కాంపిటేటివ్ ప్రారంభ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా హాజరైన ఓయూ వీసీ ప్రొ. కుమార్ మొల్గురం మాట్లాడుతూ.. అనేక కష్టనష్టాలను దాటుకుంటూ, ఉన్నత లక్ష్యాల చేరుకోవడం కోసం ఇక్కడికి వచ్చిన మీ అందరి ముందున్న ప్రధాన ఆయుదాలైన శ్రద్ధ, క్రమశిక్షణతో కూడిన అధ్యయనంతో ఉన్నత శిఖరాలను చేరుకొండని పిలుపునిచ్చారు. విశిష్ట అతిథులుగా హాజరైన ప్రముఖ సివిల్ సర్వీసెస్ అధ్యయన నిపుణురాలు, ప్రఖ్యాత సోషల్ యాక్టివిస్ట్ ఎం. బాలలత మాట్లాడుతూ.. కఠినమైన అంశాలను సులభతరంగా అర్థం చేసుకునే స్మార్ట్ వర్క్ తో కూడిన అధ్యయనం అత్యున్నత ప్రభుత్వ అధికారులను చేస్తుందని తెలిపారు. సివిల్ సర్వీసెస్ అకాడమీలో అపూర్వ అనుభవం కలిగిన ఉస్మానియా యూనివర్సిటీ రిటైర్డ్ ప్రొ. చింతా గణేష్ మాట్లాడుతూ.. నాణ్యతాపరమైన పుస్తక సేకరణనే విజయానికి ప్రధానమెట్టుగా అభివర్ణించారు. నిర్వాహన కర్త, అకాడమీ డైరెక్టర్ ప్రో .కొండా నాగేశ్వర్ మాట్లాడుతూ.. అనేక ప్రజాస్వామిక ఉద్యమాలకు నిలయమైన ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులైన మీరు అత్యున్నత ప్రభుత్వ ఉద్యోగస్తులుగా నిలిచి దేశానికి తలమానకంగా నిలవాలని కోరారు. ఏ కింది వర్గాల నుంచి అయితే వచ్చారు అదే వర్గాలకు మరింత మేలు చేకూర్చడం కోసం తపనతో, అకుంఠిత దీక్షతో ముందుకు సాగలని తెలిపారు. ఈ కోచింగ్ ను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. గతంలో ఐఏఎస్ కు సిద్ధం కావాలంటే విద్యార్థులు అనేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొనేవారు. కొందరు మాత్రమే ఎన్ని ఆర్థిక ఇబ్బందులను ఎదురకుంటూ ఇతర ప్రాంతాలకు వెళ్లి మరి కోచింగ్ తీసుకునేవారు. అలాంటి వాటికి పరిష్కారంగా ఈ కోచింగ్ సెంటర్ పనిచేస్తుందని తెలిపారు. కోఆర్డినేటర్ డాక్టర్ విజయకుమార్ వేదిక పైకి ఆహ్వానించి మాట్లాడుతూ.. ఈ సెంటర్ ఏర్పాటు వెనుక ఉన్న ఉద్దేశాలను లక్ష్యాలను వివరించారు. మొదటిరోజు వెయ్యికి పైగా విద్యార్థులు రావడం గర్వకారణం ఉందని తెలిపారు.ఈ కార్యక్రమంలో పరిశోధక విద్యార్థులు కూడా అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సివిల్ సర్వీసెస్ అకాడమీ ఉద్యోగస్తులు రఫిక్, శ్రీనివాసు, శోభ, నరేష్, భూలక్ష్మి, స్వప్న పాల్గొన్నారు.