చదువు .. పని

చదువు .. పనిరాము నిద్ర పోతున్నాడు. ఇంతలో గదిలోకి తల్లి వచ్చింది. ఏరా! ఆదివారం బడికి శెలవని హాయిగా నిద్ర పోతున్నావా. లే..లే .. ఇప్పటికే సమయం 8 గంటలు దాటింది. నీకు ఆదివారం ఎంతసేపు పడుకున్నా తనివితీరదు అంది. అమ్మా! ప్లీజ్‌ ఐదు నిమిషాల్లో లేస్తా అన్నాడు. అరగంట నుంచి ఐదు నిమిషాల్లో లేస్తానంటావు… కానీ లేవవు. చదువుకునే పిల్లలకు ఇంత బద్ధకమైతే ఎలా? ప్రశ్నించింది తల్లి. ఈసారి ఖచ్చితంగా ఐదు నిమిషాల్లో లేస్తా అన్నాడు. నువ్వు చదివేది ఐదో తరగతి. ఆదివారం శెలవు ఇచ్చేది నిద్రపోవటానికి కాదు. హోంవర్కు పూర్తి చేసుకున్నాక ఇతరత్రా పనులపై దృష్టి పెట్టి కొత్త విషయాలు తెలుసుకోవాలి అన్నది తల్లి. ఇతరత్రా విషయాలు అంటే ఏంటమ్మా! అడిగాడు రాము.
ఇతరత్రా పనులంటే ఇంటి పనుల్లో భాగస్వాములు కావటం, మార్కెట్‌కు వెళ్లి కూరగాయలు తేవటం, పత్రిక చదవటం, తోట పని.. యోగా చేయటం, వంట పనిలో నాకు సాయం చేయటం అన్నది తల్లి. దానికి అన్ని పనులు నేను చేస్తే మీరేం చేస్తారు అన్నాడు రాము.
మేం పనులు చెయ్యలేక నిన్ను చెయ్యమనటం లేదు. నీకు వారంలో ఆరు రోజులు స్కూలుకి వెళ్లటం, చదవటం, హోంవర్కు ఉంటాయి. ఆదివారం అయినా ఇతర పనులపై దృష్టి పెడితే వాటిలో వుండే కష్టం.. సుఖం తెలుస్తుంది. పని చేశాక కలిగే ఆనందం మాటల్లో చెప్పలేనిది. అది పని చేసే వారికే తెలుస్తుంది అంది తల్లి.
అయితే వాటి గురించి వివరంగా చెప్పమ్మా అంటూ మంచం మీద నుంచి లేచాడు రాము. ఈరోజు నువ్వు నాతో పాటు ఉండాలి. నేను చేసే పనులను గమనించాలి. నువ్వు చెయ్యగలిగే పనులుంటే చెయ్యాలి అన్నది తల్లి. రామూకి కూడా తల్లి చెప్పే మాటలు ఉత్సాహం కలిగించాలి. అమ్మా! ఆకలవుతుంది. ఈరోజు ఏం టిఫిను చేశావు అన్నాడు. ఈరోజు నేను చెప్పినట్లు వినాలి. ముందు యోగా చేద్దాం. ఆ తర్వాత టిఫిను చేద్దాం అన్నది తల్లి. రాము కాలకృత్యాలు తీర్చుకుని, అయిష్టంగానే తల్లిని అనుసరించాడు. తల్లి ఒకచోట కూర్చొని కళ్లు మూసుకుని.. శరీరాన్ని నిటారుగా ఉంచి .. కుడిచేతిని ముక్కు మీద ఉంచింది. రాము ఆశ్చర్యంగా తల్లిని గమనించసాగాడు. ఆ తర్వాత ఒకవేలితో ముక్కును మూస్తూ .. తెరుస్తూ శ్వాసను వదలటం, తీసుకోవటం చేయసాగింది. రాము కూడా మొదట్లో కాస్త కష్టమైనా తర్వాత తల్లి చేసినట్లు చెయ్యసాగాడు.
కాసేపటి తర్వాత తల్లి కళ్లు తెరిచి ఎలా ఉంది అని అడిగింది. కష్టమైనా బాగుంది అన్నాడు రాము. ప్రతిరోజు యోగా చెయ్యగలిగితే రోగాలు రావు అన్నది తల్లి. తర్వాత ఇద్దరూ కలిసి టిఫిన్‌ చేశారు. అనంతరం రామూని తీసుకుని పెరటి వైపు వెళ్లి, అక్కడ తల్లి పూల మొక్కలు, పండ్ల చెట్లకు పాదులు చేస్తూ రామూని కూడా చెయ్యమన్నది. తల్లితో కలిసి పాదులు చెయ్యటం రామూకి సంతోషం కలిగించింది. పాదులు చేశాక నీళ్లు పొయ్యమన్నది తల్లి. రాము చిన్న బక్కెట్‌ తో నీళ్లు తెచ్చి మొక్కలకు పోయసాగాడు. మధ్యమధ్యలో బక్కెట్‌ మొయ్యలేక ”అమ్మా .. అబ్బా” అంటున్నాడు. తల్లి గమనించి శరీరానికి శ్రమ లేకపోతే కష్టం. మొక్కలు, చెట్లకు పాదులు చేసి నీళ్లు పెట్టకపోతే మనకు పూలు, పండ్లు ఇవ్వవు. వాటిని జాగ్రత్తగా సంరక్షిస్తే అవి పర్యావరణ పరిరక్షణకు తోడ్పడుతాయి అన్నది తల్లి.
అమ్మా! పెరట్లో ఈ మొక్కల మధ్య చల్లగా బాగుంది అన్నాడు. చూశావా! మనలా ప్రతి ఒక్కరూ మొక్కలను పెంచితే అవి మహావక్షాలై అధిక ఉష్ణోగ్రతలను తగ్గిస్తాయి అన్నది. ఇంతలో గేటు ముందు ఆంధ్రజ్యోతి పేపరు కనపడింది. రాము పేపరు పట్టుకుని నాన్నకు ఇచ్చిరానా అన్నాడు. పేపరు నాన్న, అమ్మలే కాదు. మీలాంటి పిల్లలూ చదవాలి. ప్రతిరోజూ పేపరు చదవటం వల్ల ప్రపంచంలో ఎక్కడెక్కడ ఏం జరిగిందో తెలుస్తుంది. కరెంట్‌ ఎఫైర్సు తెలుస్తాయి. భాష మీద పట్టు వస్తుంది అన్నది తల్లి.
అమ్మా! నువ్వు మాట్లాడుతుంటే ఇంకా వినాలనిపిస్తుంది. తెలుగు భాష గొప్పతనాన్ని చాలా చక్కగా వినిపించావు. శ్రీకష్ణ దేవరాయలు ‘తేనె కన్నా తియ్యనైనది తెలుగు భాష’ అన్నారనిమా తెలుగు మాస్టారు చెప్పారని గుర్తుచేశాడు రాము. ఆ తర్వాత ఇద్దరూ కలిసి వంట గదిలోకి వెళ్లారు. రాముతో ఈరోజు వంటలో నాకు సాయం చేయాలి అన్నది తల్లి. రోజూ నువ్వే చేస్తున్నావుగా.. నాకు వంట రాదుగా అమాయకంగా అన్నాడు రాము. పిల్లలు చదువులోనే కాదు ప్రతి పనిలోనూ ముందుండాలి. ఈ పని రాదు .. ఈ పని చేయలేను అనకూడదు. ప్రతిపనిలో కష్టనష్టాలు తెలుసుకోవాలి. ఇతరులకు సాయపడాలనే ఆలోచన రావాలి. అప్పుడే పిల్లల్లో ఆత్మవిశ్వాసం కలుగుతుంది. తాము ఏ రంగాన్ని ఎంచుకోవాలో అవగాహన ఏర్పడుతుంది అన్నది తల్లి.
రాము తల్లికి సాయంగా కూరగాయలు కడగటం, ఉప్పు, కారం అందించటం చేశాడు. చివర్లో కూరగాయలు తరగ్గా వచ్చిన తొక్కలను ఏరి దూరంగా పడేశాడు. వంట అయ్యాక రామూకి చూపించింది. పప్పు, కూర రుచి బాగుందమ్మా అన్నాడు రాము. భోజనాలు అయ్యాక అందరూ విశ్రమించారు. సాయంత్రం తల్లి రామూని తీసుకుని సంతకు బయలుదేరింది. అక్కడ తల్లి కూరగాయలు బేరం చేయటం, తాజాగా ఉన్న వాటిని ఏరటం గమనించాడు రాము. దారిలో రాము తల్లితో నీకు ఇన్ని పనులు ఎలా వచ్చు? ఎలా చేయగలుగుతున్నావు? ఎలా మాట్లాడుతున్నావు? అని ప్రశ్నించాడు.
అవసరం అన్నీ నేర్పిస్తుంది.. చేయిస్తుంది అన్నది తల్లి. రేపటి నుంచి నా పనులు నేనే చేసుకుంటా.. ఖాళీ సమయంలో నీకు సహాయపడతా అన్నాడు. తల్లి ప్రేమతో రామూని దగ్గరకు తీసుకుంది.
– తమ్మవరపు వెంకట సాయి సుచిత్ర, 9492309100