– పీయూసీకి స్పీకర్ ప్రసాద్‌కుమార్ దిశా నిర్దేశం
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
శాసన మండలి ద్వారా ఏర్పాటైన కమిటీల్లో ప్రభుత్వ లెక్కల కమిటీ, అంచనాల కమిటీ, ప్రభుత్వరంగ సంస్థల కమిటీ చాలా కీలక పాత్ర పోషిస్తాయని శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ తెలిపారు. ప్రభుత్వరంగ సంస్థలకు సంబంధించిన సమాచారాన్ని సభ్యులు పూర్తిగా అధ్యయనం చేయాలని సూచించారు. చర్చల్లో క్రియాశీలకంగా పాల్గొనాలనీ, ఆ సంస్థలను బలపరిం చేందుకు తమ విలువైన సలహాలను, సూచనలను ఇవ్వాలని కోరారు. ప్రభుత్వానికి సంబంధించిన వివిధ శాఖలు, ప్రభుత్వరంగ సంస్థల ఆర్థిక వ్యవహారాలను సమీక్షించి, తగు సూచనలు చేయాలని కోరారు. బుధవారం హైదరాబాద్‌లోని అసెంబ్లీ కమిటీ హాల్‌లో పీయూసీ చైర్మెన్ కె. శంకరయ్య అధ్యక్షతన కమిటీ సమావేశమైంది.
ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ కమిటీ సభ్యులందరూ ప్రతి సమావేశానికి హాజరు కావాలన్నారు. చైర్మెన్ నాయకత్వంలో కమిటీ చాలా సమర్ధవంతంగా పని చేస్తుందనే నమ్మకం, విశ్వాసముందన్నారు.
ఆ సంస్థలలోని అవకతవకలను, లోపాలను సరిదిద్దడం ద్వారా అన్ని ప్రభుత్వరంగ సంస్థలు బలపడి, ఆరోగ్యకరంగా పని చేసి ప్రభుత్వానికి ఆర్థికంగా సహాయ సహకా రాలను అందించాలని కోరారు.
సమావేశానికి మండలి చైర్మెన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, కమిటీ సభ్యులు సంజీవరెడ్డి, లక్ష్మీకాంతారావు, శేరి సుభాష్ రెడ్డి, తాతా మధుసూదన్, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్, అసెంబ్లీ కార్యదర్శి డాక్టర్ వి.నరసింహాచార్యులు, రాష్ట్ర అకౌంటెంట్ జనరల్ పి. మాధవి, డిప్యూటీ అకౌంటెంట్ జనరల్ నాగేశ్వర్ రెడ్డి హాజరయ్యారు.