– ముగిసిన అధికారుల బృందం అధ్యయనం
– అనుభవాలను కలెక్టర్ తో పంచుకున్న అధికారులు
– కేంద్ర, రాష్ట్ర సంక్షేమ పథకాలను వివరించిన కలెక్టర్
నవతెలంగాణ – నల్గొండ కలెక్టరేట్
ఐఏఎస్, ఐపీఎస్, ఇతర కేంద్ర సర్వీసుల ఉద్యోగాలలో శిక్షణ పొందే అధికారులకు గ్రామస్థాయిలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అధ్యయనం చేయడం వారు సర్వీస్ లో ఉన్నంతకాలం మర్చిపోలేని అనుభూతిగా మిగిలిపోతుందని జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి అన్నారు. భవిష్యత్తు పరిపాలనలో అఖిల భారత సర్వీసులు, కేంద్ర సర్వీసుల అధికారులకు గ్రామాల అధ్యయనం బాగా ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో అఖిలభారత సేవలు, కేంద్ర సర్వీస్ లకు సంబంధించిన అధికారుల బృందం ఈనెల 21 నుండి 28 వరకు నల్గొండ జిల్లాలో ఎంపిక చేసిన గ్రామాలలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల పై అధ్యయనానికి వచ్చిన విషయం తెలిసిందే. కాగా సోమవారంతో వీరి అధ్యయనం ముగియగా, జిల్లా కేంద్రంలో జిల్లా కలెక్టర్ ను కలిసి వారి అధ్యయన అనుభవాలను కలెక్టర్ తో పంచుకున్నారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి మాట్లాడుతూ వారి అధ్యయనంలో అనుభవాలను విన్న ఆనంతరం ఆయన ప్రజల సంక్షేమం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పలు కార్యక్రమాలను వివరించారు. ముఖ్యంగా పేద ప్రజల సంక్షేమంలో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నాయని వాటిలో రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వల తరఫున ప్రజలకు ఆహార భద్రత కల్పించడంలో భాగంగా దారిద్రరేఖకు దిగవనున్న వారికి బియ్యం పంపిణీ చేయడం జరుగుతున్నదని, రాష్ట్ర ప్రభుత్వం రూపాయికే కిలో బియ్యాన్ని ఇస్తున్నదని, జనవరి నుండి సన్నబియ్యాన్ని రేషన్ కార్డుదారులకు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిపారు. భూములకు సంబంధించి గతంలో ధరణి పోర్టల్ ఉండేదని, రికార్డులు సరైనవిగా లేకపోవడం వల్ల లోప భూఇష్టం కారణంగా నూతన ప్రభుత్వం కొత్త రెవెన్యూ చట్టాన్ని తీసుకురాబోతున్నట్లు తెలిపారు. నల్గొండ జిల్లాలో దేవరకొండ, నందికొండ మున్సిపాలిటీలు నూతనంగా వెలిసిన మున్సిపాలిటీలు అయినప్పటికీ నందికొండ మున్సిపాలిటీ పరిధిలో ప్రభుత్వ భూములను సాగు చేసుకుంటున్న రైతులకు యాజమాన్య హక్కులు లేవని, వాటిని క్రమబద్ధీకరించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించారు.
మండల స్థాయిలో రెవెన్యూ వ్యవస్థ లేదని, తాసిల్దార్ ఆన్లైన్ ద్వారా భూముల అంశాలను పరిశీలిస్తున్నారని తెలిపారు. ఎంపీడీవో ఆధ్వర్యంలో అభివృద్ధి కార్యక్రమాలు, తహసిల్దార్ ఆధ్వర్యంలో రెవెన్యూ కార్యక్రమాలు జరుగుతున్నాయని తెలిపారు. ప్రస్తుతం గ్రామపంచాయతీకి పంచాయతీ కార్యదర్శి అన్ని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఇతర అంశాలను చూసే వ్యక్తిగా ఉంటున్నారని వెల్లడించారు. గ్రామంలో వైద్య ఆరోగ్య విషయాలను అంగన్వాడి, ఆశ కార్యకర్తలు చూస్తుండగా, విద్య లో భాగంగా ప్రతి గ్రామంలో పాఠశాల హెడ్మాస్టర్ , ఉపాధ్యాయులు ఉంటారని, గ్రామపంచాయతీ నోడల్ ఏజెన్సీగా ఉంటుందని తెలిపారు. ఎవరైనా మహిళ గర్భవతి అయినప్పటి నుండి ప్రసవానంతరం బిడ్డకు ఆరు సంవత్సరాలు వచ్చే వరకు ప్రభుత్వమే వారి ఆరోగ్య సంరక్షణ బాధ్యతను తీసుకుంటుందని, బిడ్డకు వ్యాక్సినేషన్ సైతం ఇస్తుందని తెలిపారు. ప్రజలకు మిషన్ భగీరథ పథకం ద్వారా రక్షిత మంచినీటిని ప్రభుత్వం అందిస్తున్నదని, ప్రతి మనిషికి ప్రతిరోజు 100 లీటర్ల రక్షిత మంచినీరు అందించేలా మిషన్ భగీరథ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు. వ్యవసాయంలో భాగంగా రైతు భరోసా, రైతు బీమా పథకాలు మంచి పథకాలని, రైతు భరోసా కింద ఎకరాకు పదివేల రూపాయలు ఇచ్చే ఆలోచనలో ప్రభుత్వం ఉందని, అలాగే కౌలు రైతులకు సైతం ఇచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నదని తెలిపారు. రైతు బీమా కింద ఎవరైనా రైతు చనిపోతే 10 నుండి 15 రోజుల్లోనే చనిపోయిన రైతు కుటుంబానికి 5 లక్షల రూపాయల బీమాను ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. వీటితోపాటు గ్రామ, మండల స్థాయిలో అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయడం జరుగుతున్నదని ఆయన కేంద్ర సర్వీసుల బృందం అధికారులకు వివరించారు. సమావేశ అనంతరం గ్రామాల అధ్యయనానికి వచ్చిన అధికారులను జిల్లా కలెక్టర్ శాలువ, జ్ఞాపికలతో సన్మానించారు.స్థానిక సంస్థల అతను కలెక్టర్ టి. పూర్ణచంద్ర, జిల్లా పరిశ్రమల శాఖ జాయింట్ డైరెక్టర్ కోటేశ్వరరావు, జెడ్పి సీఈవో ప్రేమ్ కరణ్ రెడ్డి, డిఆర్డిఓ శేఖర్ రెడ్డి, గృహ నిర్మాణ శాఖ పిడి రాజకుమార్, నల్గొండ ఇన్చార్జి ఆర్డీవో శ్రీదేవి, కలెక్టర్ కార్యాలయ ఏఓ మోతిలాల్, ఇతర అధికారులు ఈ కార్యక్రమం పాల్గొన్నారు.