‘వదినా! మీ ఇంట్లో ఇంకా పనులు తెమలలేదా’! అంటూ పెరటిగోడ వద్దకు వచ్చి నిలబడింది. శ్రీలక్ష్మి.
‘ఇదిగో వదినా! ఇప్పుడే అన్ని ముగించుకుని నీ వద్దకే వద్దామని అనుకుంటున్నా! ఇంతలో నీవే పిలిచావు! వస్తున్నా’! అంటూ మమత కూడా పెరటిగోడ వద్దకు వచ్చింది.
ఇంట్లో జరుగుతున్న విశేషాలు పరస్పరం ఇద్దరూ బదలాయించుకున్నారు.
‘ఏంటి వదినా! మీ అన్నయ్య నిన్న మీ పెద్దకొడుకు ఆఫీసుకు వెళ్లాడంట! కాని ఆఫీసులో మీ అబ్బాయి కనిపించలేదంట’! కొంపదీసి సస్పెండ్ అయ్యాడా ఏమిటీ’? అన్నది మమత.
‘అయ్యో! నా కొడుకేమయినా కండక్టర్ అనుకున్నావా? సస్పెండ్ కావడానికి! ఆ ఆఫీసుకే నా కొడుకు పెద్దబాస్ తెలుసా?’ అన్నది శ్రీలక్ష్మి గొప్పగా.
‘అది కాదు వదినా! మొన్నే కాదు. మీ అన్నయ్య చాలాసార్లు, ఆ ఆఫీసుకు వెళ్లాడంట. కాని మీ పెద్దబ్బాయి ఎప్పుడూ కనిపించడం లేదంట! అందుకే సస్పెండ్ అయ్యాడా అని డౌటు వచ్చింది! అందుకే అలా అడిగానమ్మా! అంతే ‘ అన్నది మమత.
‘అయినా! కొత్తదానిలా ఎంక్వైరీ చేస్తున్నావు! నీ కొడుకు పనిచేస్తున్నది. నా కొడుకు ఆఫీసులోనే కదా! నా కొడుకు పని చేసేది మీ ఆఫీసులోనే కదా! నా కొడుకు సస్పెండ్ అయితే నీకు చెపుతాడు కదా! వాడ్ని అడగకపోయావా’? అన్నది శ్రీలక్ష్మి.
‘ఏంటి! చాలా సేపటి నుంచి మాట్లాడుకుంటున్నారు? ఏమిటీ విషయం’ అంటూ వచ్చింది సరళ.
‘ఏముందీ? అంతా షరామామూలే? నీ కొడుకు ఎప్పుడూ ఆఫీసుకు రాడంట? ఎందుకూ ఉద్యోగం నుంచి సస్పెండ్ అయ్యాడా అని అడిగాను! దానికి ఏదేదో మాట్లాడుతున్నది!
ఇది న్యాయమా వదినా? అంటూ ఫిర్యాదు చేసింది మమత.
‘నా కొడుకు బాస్ కదా! ఎప్పుడూ టూర్లల్లో దేశదేశాలు తిరుగుతూ ఉంటాడు. అందుకే ఆఫీసుకు రాడు.
అంతమాత్రానే సస్పెండ్ అని పెద్దపెద్ద మాటలు ఎందుకు మాట్లాడాలి!
నీ కొడుకూ అదే ఆఫీసులో పనిచేస్తాడు కదా నీవు చెప్పు’ అన్నది శ్రీలక్ష్మి.
‘అవును వదినా నీ కొడుకూ, మమత కొడుకూ, నా కొడుకూ, నాకొడుకూ ఒకే ఆఫీసులో పనిచేస్తారు! అది తెలిసిన విషయమే! కాని మమత కొడుకూ ఆఫీసుకు పోవడం లేదు! అందుకే ఆమె ఆ విషయం చెప్పడం లేదు’ అన్నది.
‘మమత కొడుకు ఎందుకు ఆఫీసు మానేశాడు?’ ఆశ్చర్యంగా అడిగింది శ్రీలక్ష్మి.
‘వీళ్ల ఆఫీసుకు నీ కొడుకే బాస్ కదా! అయితే వీళ్ల ఆఫీసులో పనిచేసే అమ్మాయిని, పక్కసీటు వాడు రోజూ సతాయిస్తున్నాడంట!ఆ అమ్మాయిని వీడియో తీసి వాళ్ల ఆఫీసు వాట్సప్ గ్రూపులో పెట్టారంటా! ఫిర్యాదు చేద్దామని చూస్తే, మీ వాడు ఆఫీసుకే రావడం లేదు’! అన్నది సరళ.
‘మా వాడు ఆఫీసు పనిమీదే టూర్లు కొడుతుంటాడు కదా! అందుకే ఆఫీసు రావడానికి వీలు కాదు! కాని ఇంతపెదద సమస్య ఆఫీసులో వచ్చినప్పుడు, ఆఫీసుకు వచ్చి ఆ సమస్య పరిష్కరించాల్సిందే! కాని వాడు మొదటి నుంచి అంతే బాధ్యత లేకుండా బలాదూర్‌గా తిరుగుతాడు అంతే’! అన్నది శ్రీలక్ష్మి.
‘మావాడు, మీవాడు, సరళ కొడుకు మనలాగే స్నేహితులు! మీ వాడి తర్వాత మా వాడే ఆఫీసుకుఇ బాస్. ఆ తర్వాత సరళ కొడుకు బాస్. అయితే మీ వాడిని ఆఫీసుకు పిలిపించమని రెండు మూడు రోజులు ఆఫీసు వాళ్లంతా వాడిని ఒత్తిడి చేశారంట! దాంతో మీరంతా క్రమశిక్షణ తప్పిపోయారు! ఇట్లా పద్ధతి తప్పి పనిచేస్నున్నందున నేను మీ ఆఫీసుకు రానని, మావాడు కూడా ఆఫీసుకి వెళ్లడం మానివేశాడు’ రెండు మూడు రోజుల్నుండి ఇంట్లోనే ఉంటున్నాడు’ అన్నది మమత.
‘వీళ్లు మంచి ఉద్యోగాలు చేస్తున్నారు అనుకున్నాం గాని, ఇలా తయ్యారేమిటి? బొత్తిగ బాధ్యత లేకుండా ఉన్నారు’!
ఇంతకు నీ కొడుకేం చేస్తున్నాడు? అడిగారు సరళను.
‘వాడు కూడా తక్కువేం కాదు! అదే తానులోని ముక్క. నీ కొడుకుని పిలిపించమని, మమత కొడుకూ ఒత్తిడి చేస్తే వాడేమో ఆఫీసు ఎగ్గొట్టాడు. వాడు ఎగ్గొట్టాడని నా కొడుకుని అదే అడిగారంట! బాస్‌ని ఆఫీసుకి పిలిపించు! అని, దానికి అంత బాస్‌ని నేను ఎట్లా పిలిపిస్తాను? ఆయనకు ఆఫీసుకి రమ్మని బాస్‌ను పిలిపించడం లేదు. మీరు, ఆ అమ్మాయి ఏమైనా చేస్కోండి’ష అన్నది సరళ.
‘తమ ఆఫీసులో పనిచేసే, అమ్మాయిని పక్క సీటువాడు వేధిస్తూంటే ఆ విషయం తెలిసీ, అధికారం ఉండీ వాడిపై చర్యలు తీసు కోలేని బాసులు మన పుత్రరత్నాలని, చెప్పు కోలేని స్థితిలో పడిపోయాము! సాటి ఆడపిల్లలుగా సిగ్గు పడుతు న్నాము. ఈ ముగ్గురు చిన్నప్పుడు స్కూల్‌కెళ్లకుండా డుమ్మాలు కొడితే మొద్ద బ్బాయిలు అనుకున్నాం! గాని పెద్దయ్యాక మొద్దు దద్దమ్మలు అవుతారని అనుకోలేదు!’ అని ముగ్గురమ్మలూ బాధపడ్డారు.
– ఉషాకిరణ్