నెల రోజుల్లో గ్రీన్‌ ఛానల్‌ ద్వారా ఉపకారవేతనాలు

– టీ-జూడా ప్రతినిధులకు మంత్రి దామోదర హామీ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
నెల రోజుల్లో ఉపకార వేతనాల పంపిణీ ప్రక్రియను గ్రీన్‌ ఛానల్‌ ద్వారా ప్రారంభించనున్నట్టు వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. సోమవారం హైదరాబాద్‌లో మంత్రి దామోదరను కలిసిన టీ-జూడా ప్రతినిధులు ఆయనకు వినతిపత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పెండింగ్‌ ఉపకార వేతనాలను వెంటనే విడుదల చేయాలని ఆర్థికశాఖ కార్యదర్శిని కోరారు. డిస్ట్రిక్ట్‌ రెసిడెన్సీ ప్రోగ్రాంకు సంబంధించి పోస్ట్‌ గ్రాడ్యుయేట్లు ఎదుర్కొంటున్న హాస్టల్‌ సౌకర్యాలు తదితర విషయాలపై సమగ్ర నివేదకను రెండు రోజుల్లో సమర్పించాలని అధికారులను ఆదేశించారు. త్వరలోనే ఉస్మానియా జనరల్‌ ఆస్పత్రి నూతన భవన నిర్మాణం కోసం శంకుస్థాపన చేయనున్నట్టు మంత్రి తెలిపారు.