– ఆర్థిక కష్టాలున్నా…ఆరు గ్యారెంటీలు అమలు చేస్తాం
– సోనియాగాంధీకే ఈ క్రెడిట్ : సచివాలయంలో ప్రకటించిన సీఎం రేవంత్‌రెడ్డి
– గృహ విద్యుత్ 200 యూనిట్ల వరకు మార్చి నెలలో ‘జీరో’ బిల్
– ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ నేపథ్యంలో సాదాసీదాగా ప్రారంభోత్సవం
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌పార్టీ మ్యానిఫెస్టోలో ప్రకటించిన ఆరు గ్యారెంటీల్లో మరో రెండింటిని ముఖ్యమంత్రి ఏ రేవంత్‌రెడ్డి ప్రారంభించారు. మంగళవారం సచివాలయంలో జరిగిన కార్యక్రమంలో మహాలక్ష్మి స్కీం ద్వారా రూ.500కే గ్యాస్ సిలిండర్, గృహలక్ష్మి స్కీం కింద 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పథకాలను లాంఛనంగా ప్రారంభిస్తున్నట్టు ప్రకటించారు. అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్‌కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతక్క, శ్రీధర్‌బాబు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున ఈ కార్యక్రమాన్ని ఎలాంటి ఆర్భాటం లేకుండా మొదలు పెడుతున్నామని తెలిపారు. ఆరు గ్యారెంటీల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఆరోగ్య శ్రీ పరిమితి పెంపు హామీలను తాము అధికారంలోకి వచ్చిన మూడ్రోజుల్లోనే అమల్లోకి తెచ్చామని గుర్తుచేశారు. తాజాగా మరో రెండు గ్యారెంటీలు అమలు చేస్తున్నామన్నారు. ఈ క్రెడిట్ అంతా కాంగ్రెస్ పార్టీ అగ్రనేత సోనియాగాంధీకే చెందుతుందని ప్రకటించారు. రాష్ట్రానికి ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా, ఆరు గ్యారంటీలను కచ్చితంగా అమలు చేస్తామని స్పష్టంచేశారు. కట్టెల పొయ్యి నుంచి మహిళలకు విముక్తి కల్పించాలని ఆనాటి యూపీఏ ప్రభుత్వం భావించి, తక్కువ ధరకే పేదలకు గ్యాస్ కనెక్షన్లు ఇచ్చిందనీ, కేంద్ర ప్రభుత్వం గ్యాస్ ధరను పెంచితే వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ఆ భారాన్ని ప్రభుత్వం భరించి పేదలకు రూ.400కే సిలిండర్ అందించారని గుర్తుచేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం గ్యాస్ సిలిండర్ ధరను రూ.1,200కి పెంచి, పేదల ఇంటి బడ్జెట్‌ను తలకిందులు చేసిందని విమర్శించారు.
సచివాలయంలో ఈ స్కీంలను ప్రారంభిస్తున్నట్టు ప్రకటించగానే ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి ఎస్ఏఎమ్ రిజ్వి గృహజ్యోతి స్కీంకు సంబంధించిన జీవో జారీ చేశారు. 200 యూనిట్ల వరకు గృహ వినియోగ విద్యుత్‌కు బిల్లు ఉండదనీ, మార్చి నెల నుంచి ‘జీరో’ బిల్లులు జారీ చేస్తారని పేర్కొన్నారు. ఈ స్కీం తక్షణమే అమల్లోకి వస్తుందని చెప్పారు. ప్రజాపాలన ద్వారా గృహజ్యోతి స్కీం కోసం స్వీకరించిన దరఖాస్తుల్లో తెల్లరేషన్‌కార్డుకు ఆధార్‌కార్డు, డొమెస్టిక్ కనెక్షన్‌ను అనుసంధానం చేసుకున్నవారికి ఈ స్కీం వర్తిస్తుందని వివరించారు. ఏ నెలలో 200 యూనిట్లలోపు కరెంటు వినియోగం ఉంటే ఆ నెలలోనే జీరో బిల్లు వస్తుందని స్పష్టత ఇచ్చారు. ఈ సొమ్మును విద్యుత్ పంపిణీ సంస్థలకు ప్రభుత్వం రీయింబర్స్మెంట్ చేస్తుందనీ, ప్రతినెలా 20వ తేదీలోపు ఆ లెక్కల్ని సర్కారుకు పంపాలని ఆదేశించారు. ఈ మేరకు ఆర్థికశాఖ కూడా ఉత్తర్వులు ఇచ్చినట్టు తెలిపారు. మరోవైపు అర్హులైనవారికి రూ.500కే గ్యాస్ సిలిండర్ పథకం అమలు చేస్తున్నట్టు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రేషన్‌కార్డు ఉన్న వారికే ఈ పథకం వర్తింస్తుందని స్పష్టం చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 1.20 కోట్ల గ్యాస్ కనెక్షన్లు ఉండగా, అందులో రేషన్‌కార్డు ఉన్న కుటుంబాలు 89.99 లక్షలు ఉన్నాయి. గ్యాస్ కంపెనీలకు నెలవారీగా సబ్సిడీ చెల్లిస్తామని ప్రభుత్వ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. లబ్ధిదారులకు సబ్సిడీ సొమ్మును గ్యాస్ కంపెనీలు బదిలీ చేస్తాయి. గ్యాస్ లబ్దిదారులు తొలుత పూర్తి సొమ్మును చెల్లించి సిలిండర్ తీసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత వారి ఖాతాల్లోకి సబ్సిడీ సొమ్ము వేస్తారు.