త్రిప్ట్, నూలుపై సబ్సిడీ పథకాలను పునర్ ప్రారంభించాలి

నవతెలంగాణ- భువనగిరి : చేనేత కార్మికులకు ఎంతగానో ఉపయోగ పడుతున్న త్రిప్ట్, నూలుపై సబ్సిడీ పథకాలను ప్రభుత్వం వెంటనే పునర్ ప్రారంభించాలని, వృత్తి దారుల జిల్లా కన్వీనర్ మాటూరి బాలరాజు, చేనేత కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి  గుండు వెంకటనర్సు, ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు.  గురువారం స్థానిక సుందరయ్య భవన్లో చేనేత కార్మిక సంఘం జిల్లా కమిటీ సమావేశం జిల్లా అధ్యక్షులు గుర్రం నర్సింహా  అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో వారు పాల్గొని మాట్లాడారు చేనేత కార్మికులు రోజువారి కూలిపనిలో పొదుపు చేసి, కార్మికుడు రూ. 1200 లు, అనుబంధ కార్మికులు రూ. 800 లు, చొప్పున ప్రతి నెల ఆర్డి 1 బ్యాంక్ ఖాతలో జమచేస్తే, ప్రభుత్వం ఆర్డి 2 లో రెండింతలు రూ 4000 చొప్పున జమచేసి, మూడు సంవత్సరాలకు తీసుకునే విధంగా గత ప్రభుత్వం త్రిప్ట్ పథకం ప్రవేశపెట్టిందన్నారు. అది కరోనా కష్టకాలంలో,  చేనేత కార్మికులకు ఎంతగానో ఉపయోగ పడిందని తెలిపారు. ఆగస్టు నెలలో ముగిసిన ఈ త్రిప్ట్ పతకాన్ని మళ్ళీ పునర్ ప్రారంభించాలని కోరారు. నూలుపై రూ. 40 శాతం సబ్సిడీ నేరుగా కార్మికుల ఖాతల్లో జమచెయ్యాలన్నారు. ప్రతి చేనేత కుటుంబానికి పెట్టుబడి సాయంగా రూ. 5 లక్షల సాయం అందించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఇండ్లు లేని నిరుపేద చేనేత కార్మికులకు  హౌజ్ కం వర్క్ షెడ్ నిర్మించి ఇవ్వాలని విజ్ఞప్తి చేసారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు గుర్రం నర్సింహా, జిల్లా ఉపాధ్యక్షులు కూరపాటి రాములు, గంజి రామచంద్రం, బోడ ఆంజనేయులు పాల్గొన్నారు.