విజయీభవ

successయూపీఎస్సీ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాల అభ్యర్థుల ప్రతిభ నింగికెగిసింది. ఏకంగా రెండో ర్యాంక్‌ సాధించడం ద్వారా మరోసారి తెలుగుజాతి కీర్తి పతాకానికెక్కింది. సుమారు అరవై మంది తెలుగు తేజాలు విజయబావుటాను ఎగురవేశారు. వారికి అభినందనలు. శుభాకాంక్షలు. వీరంతా ఐఏఎస్‌, ఐఎఫ్‌ఎస్‌, ఐపీఎస్‌, ఐఆర్‌ఎస్‌ తదితర అఖిల భారత సర్వీసు(ఏఐఎస్‌)ల్లో సేవలందించ బోతున్నారు. ప్రజాసేవ చేయడానికే సివిల్స్‌ను ఎంపిక చేసుకున్నామని చెప్పడం మంచి పరిణామం. వెనుకబడిన ప్రాంతంగా పరిగణించే మహబూబ్‌నగర్‌ జిల్లాకు చెందిన పలువురు అత్యుత్తమ ప్రతిభ కనపర్చడం సంతోషం కలిగిస్తున్నది. ఊతమిస్తే ఎంతవరకైనా ఎదుగుతామని చెప్పకనే చెప్పారు అభ్యర్థులంతా. ఆయా సామాజిక తరగతులకు చెందిన వీరు, భవిష్యత్‌ తరాలకు సేవలందించే అధికారిక ప్రతినిధులు. ఏఐఎస్‌ అధికారుల శక్తి, సామర్థ్యాలు, నైపుణ్యం సమాజానికి ఉపయోగపడాలి.
ప్రతియేటా యూపీఎస్సీ కేవలం 180 మంది ఏఐఎస్‌లను మాత్రమే ఎంపిక చేస్తుంది. వీరంతా అత్యంత ప్రతిభావంతులై ఉంటారు. అధికారాలను చెలాయిం చడమే వీరి అధికారం కాదు, దాన్ని ప్రజలు, పేదలు, అణగారిన తరగతుల ప్రయోజనాల కోసం వాడటం ప్రధానం. కీలకం కూడా. ప్రజాసేవ చేయాలంటే సమాజంపై విస్త్రృత అవగాహన ఉండాలి. సమస్యలపై లోతైన అధ్యయనమూ తప్పనిసరి. చట్టాలు, విధానాలకు మానవతా విలువలను జోడించి మంచి పరిపాలనను అందించడమే కర్తవ్యంగా భావించాలి. దేశంలో సివిల్‌ సర్వీసులకు చాలా ప్రాముఖ్యత ఉంది. అభివృద్ధిలో ఏఐఎస్‌ల పాత్ర గొప్పదనే చెప్పాలి. అయితే పరిస్థితులు మారుతున్నాయి. ఐఏఎస్‌ల్లోనూ అది చోటుచేసు కుంటున్నది. ప్రజాసేవ మసకబారి స్వయంసేవకు పూనుకుంటున్నారు. పాలకులు, కార్పొరేట్ల సేవలో తరిస్తున్నారు. విధానాల రూపకల్పనలోనే తప్పులు దొర్లుతున్నాయి. తద్వారా దేశాభివృద్ధి కుంటు పడుతున్నది. దీంతో ప్రజల తిరుగుబాటును చవిచూడాల్సి వస్తున్నది. పబ్లిక్‌ సర్వీసు నుంచి ప్రయివేటు సర్వీసుకు మళ్లుతున్న దుస్థితి కనిపిస్తున్నది.
కార్పొరేట్ల బాగోగులు కాకుండా అట్టడుగు స్థాయి మట్టి మనుషుల మనుగడపై దృష్టిపెట్టాలి. శిక్షణ నుంచే ఆ అభిమతాన్ని నరనరాల్లోనూ ఇమడ్చుకోవాలి. కొందరు చేసే దిగజారుడు పనులతో సాంతం వ్యవస్థ తు(త)ప్పు(న)పడుతున్నది. మోకాళ్ల మీద కూర్చుని దండాలు పెడుతూ, తమ ప్రాథమిక బాధ్యతను నిర్లక్ష్యం చేస్తున్న వైనాలు ఎన్నో. దీంతో సమాజ ఉద్దరణ, ప్రజల జీవన ప్రమాణాల మెరుగు ప్రశ్నార్థకమవుతున్నది. కర్తవ్యాల నిర్వహణలో విఫలమవుతున్న పరిస్థితి. పైపెచ్చు సరళీకృత ఆర్థిక విధానాల అమలు నేపథ్యంలో అమెరికా, ఇజ్రాయిల్‌ దేశాలతో ఒప్పందాల్లో భాగంగా ఇస్తున్న పరిపాలన, సైనిక శిక్షణతో ఏఐఎస్‌లను విధానపరంగానే విభిన్నంగా తయారు చేస్తున్నారు.
పెట్టుబడిదారి విధానాలను మస్తిష్కంలో నింపి క్షేత్రస్థాయిలో పేదలకు వ్యతిరేకంగా పనిచేయిస్తుండటం గమనార్హం. ఏఐఎస్‌ అనేది కెరీర్‌ ఆప్షనేకాదు, జాతికి సేవలందించగలిగే గురుతర బాధ్యత. లక్షల్లో జీతాలు, సమాజంలో గౌరవం అందుకునే వీరంతా, పేదల పక్షపాతులుగా ఉండాలి. నిరుద్యోగులకు దారి చూపించాలి. బాధితులకు బాసటగా నిలవాలి. కాగా పదేండ్ల కిందటి ఉన్నతాధికారులు, ఇప్పటి వారికి తేడా స్పష్టంగా కనిపిస్తున్నది. సరైన విధానాలను రూపొందించి అమలు చేయడం ద్వారా పాలకులచేత కాకుండా ప్రజలచేత శభాష్‌ అనిపించుకోవాలి.
ఆ కోవకు చెందిన ఐఏఎస్‌ అధికారే ఎస్‌.ఆర్‌ శంకరన్‌. ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టం రూపకర్త. వెట్టిచాకిరి నిర్మూలన, అటవీ హక్కుల చట్టం, ఎస్సీ కార్పొరేషన్‌కు ఊపిరులూదిన ఐఏఎస్‌. 1984లో సాంఘీక సంక్షేమ గురుకులాల వ్యవస్థ ఏర్పాటులో, 2004లో ప్రభుత్వంతో మాట్లాడి మవోయిస్టులను చర్చలకు ఆహ్వానింపజేయడంలో ఆయనదే కీలకపాత్ర. ఖమ్మం, ఆదిలాబాద్‌ జిల్లాల్లో పనిచేసిప్పుడు ఆయన్ను అప్పటి ప్రభుత్వాలు బదిలీ చేయగా, అందుకు వ్యతిరేకంగా ప్రజలే ఆందోళన చేసిన పరిపాలనాదక్షుడు. ఆయన్ను ఐఏఎస్‌ గాంధీ అని పిలిచేవారు.
శంకరన్‌ సేవలను గుర్తించి కేంద్ర ప్రభుత్వం పద్మవిభూషన్‌ పురస్కారానికి ఎంపిక చేసినా, సున్నితంగా తిరస్కరించిన గొప్పవ్యక్తి. నేటి ఐఏఎస్‌లు ఎస్‌ఆర్‌ శంకరన్‌ను స్ఫూర్తిగా తీసుకోవాలి. ఆ బాటలో నడవాలి. పేదల కోసం ఎంతటి త్యాగాలకైనా వెనుతిరగని వ్యక్తిత్వాన్ని ఒంటపట్టించు కోవాలి. అప్పుడే తమ లక్ష్యమైన ప్రజాసేవ చేయాలనే సంకల్పం నేరవేరుతుంది. విజయీభవ.