విజయం

successవిజయం.. ప్రతీ ఒక్కరూ కచ్చితంగా కోరుకుంటారు. జీవితంలో విజయం సాధించాలనే కసి అందరిలో ఉంటుంది. అయితే కేవలం కోరిక ఉంటే మాత్రమే సరిపోదు. జీవితంలో నిజంగా విజయం సాధించాలంటే కచ్చితంగా కష్టపడాల్సిందే అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే మనలో చాలా మంది విజయం సాధించాలనే కోరిక ఉన్నా ఆ దిశగా అడుగులు వేయరు. మరీ ముఖ్యంగా మనలో వుండే కొన్ని రకాల లోపాల వల్ల ఎంత ప్రయత్నించినా విజయాన్ని అందుకోలేమని నిపుణులు చెబుతున్నారు. వాటిని వదిలించుకుంటే విజయం మన సొంతమవుతుందని కూడా చెబుతున్నారు.
జీవితంలో విజయం సాధించాలన్నా, ఉన్నత స్థానానానికి చేరుకోవాలన్నా కచ్చితంగా ఉండకూడని లక్షణాల్లో ఈర్ష్య ఒకటి. ఇతరుల సంతోషాన్ని చూసి ఓర్వలేని వారి జీవితంలో ఎప్పుడూ విజయం సాధించలేరని, వీరు ఇతరుల మద్ధతు ఎప్పుడూ పొందలేరని నిపుణులు చెబుతున్నారు. కనుక ఈర్ష్యను మన మనసులో నుండి తీసివేయాలి. మనం సాధించలేనిది ఇతరులు సాధిస్తే మనస్ఫూర్తిగా స్వాగతించాలి. అది వాళ్ళకు ఎలా సాధ్యమయిందో తెలుసుకోవాలి. అవసరమైతే వారి సలహాలు తీసుకోవాలి.
మనసుపై నియంత్రణలేని వారు, చంచలమైన మనసుతో ఉండే వారు కూడా విజయాన్ని సాధించలేరని నిపుణులు చెబుతున్నారు. మనసు నియంత్రణలో ఉంటేనే జీవితంలో అనుకున్న లక్ష్యాలు చేరుకోవచ్చు. అస్థిరమైన మనసు ఉన్న వ్యక్తులు ఏ పనిపైనా దృష్టి పెట్టలేరు. అలాగే ఏ నిర్ణయాన్ని సరిగ్గా తీసుకోలేరు. కనుక మన మనసును ఎప్పుడూ మన ఆధీనంలో ఉంచుకునే ప్రయత్నం చేయాలి. అది స్థిరంగా ఉంటేనే అనుకున్నది సాధించగలమని గుర్తుంచుకోవాలి. అలాగే నిపుణుల అభిప్రాయం ప్రకారం క్రమశిక్షణ లేని వారు కూడా జీవితంలో విజయం సాధించలేరు. క్రమశిక్షణ లేని వారికి ఒకవేళ విజయం వరించినా అది ఎక్కువ కాలం నిలవదు. కాబట్టి పనులు విజయవంతం కావాలన్నా, వచ్చిన ఆ విజయం ఎక్కువ కాలం నిలిచి ఉండాలన్నా కచ్చితంగా క్రమ శిక్షణ ఉండాల్సిందే.
ఇక జీవితంలో ఉన్నత స్థానానికి చేరుకోవాలంటే నిజాయితీ కూడా ఎంతో ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు. చేసే పనిపట్ల నిబద్ధత, నిజాయితీ ఉంటే జీవితంలో ఎప్పుడైనా విజయం వరిస్తుంది. కనుక నిజాయితీగా జీవించడానికి ప్రాముఖ్యం ఇవ్వాలి. ఆ నిజాయితీనే మనల్ని ఉన్నత శిఖరాలకు చేరుకునేలా చేస్తుంది. నిజాయితీగా ఉన్న వారిని కొందరు పిరికి వారిగా, చేతవాని వారిగా చూస్తారు. మన చుట్టూ ఉన్న సమాజం కూడా అలా ఉంది. కానీ ఎప్పటికైనా నిజాయితీనే మనల్ని గెలిపిస్తుందనేది గుర్తు పెట్టుకోవాలి.
మనలో కొందరు ఏ లక్ష్యం లేకుండా జీవిస్తుంటారు. ఇలాంటి వారు ఎన్నడూ జీవితంలో విజయాన్ని అందుకోలేరు. లక్ష్యం లేని జీవితం చుక్కాని లేని నావ లాంటిది. అలాంటి నావ దేనికీ పనికి రాదు. అందుకే మన స్థాయికి తగ్గట్లు మనం ఏదో ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఆ లక్ష్యం కోసం పనిచేస్తూ పోవాలి. నిరంతరం శ్రమించాలి. అవరమైన అధ్యయనం చేయాలి. అప్పుడు ఏదో రోజు విజయం కచ్చితంగా మనల్ని వరిస్తుంది. జీవితంలో విజయం సాధించకలేపోవడానికి మరో ప్రధాన కారణం సోమరితనం. ఈ లోపం ఎన్నటికీ విజయాన్ని అందించలేదు. అందుకే సోమరితనాన్ని విడిచి పెట్టాలి. శ్రమించేందుకు ప్రాధాన్యం ఇవ్వాలి. మనం చేసే పని పట్ల కచ్చితమైన నిబద్ధతతో ఉండాలి. అప్పుడే విజయం వరిస్తుంది. శ్రమ నీ ఆయుధమైతే విజయం నీ బానిసవుతుంది అనే విషయాన్ని ఎప్పుడూ గుర్తుంచుకోవాలి.