విజ‌యాలు వివాదాలూ సంచ‌ల‌న‌మే…

Controversies are the successes...ఈ ఏడాది తెలుగు సినిమాలు దిమ్మ తిరిగే కలెక్షన్లను కొల్లగొట్టాయి. భారీ వసూళ్ళతో దేశ సినిమా చరిత్రలోనే సరికొత్త రికార్డులను సృష్టించాయి. ఈ కలెక్షన్ల పరంపరతో నేషనల్‌,  ఇంటర్నేషనల్‌ లెవల్‌లో తెలుగు సినిమా శభాష్‌ అనిపించుకుంది.
అయితే విజయాలు ఎంతగా సంచలనం సృష్టించాయో, అదే స్థాయి వివాదాలతో టాలీవుడ్‌ టాక్‌ ఆఫ్‌ ది వరల్డ్‌ అయ్యింది.
మెగాస్టార్‌ స్టార్‌ చిరంజీవి గిన్నీస్‌బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌లో చోటు సంపాదించుకుని అరుదైన రికార్డ్‌ని సొంతం చేసుకున్నారు. ఆయన తన 46 ఏండ్ల సినిమా కెరీర్‌లో 156 సినిమాల్లో 537 పాటల్లో 24వేలకు పైగా భిన్న డ్యాన్స్‌ స్టెప్పులతో ప్రేక్షకులను అలరించారు. ఇది ప్రపంచంలోని ఏ నటుడికి సాధ్యం కాని ఫీటు అంటూ మెగాస్టార్‌ని గిన్నీస్‌ వరల్డ్‌ రికార్డ్‌ గుర్తించింది.
ఈ ఏడాది జరిగిన ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన అన్ని స్థానాల్లో విజయ దుందుభి మోగించి, జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌ సంచలనం సృష్టించారు. ఏపీ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలను స్వీకరించారు. ఓ హీరో ఉప ముఖ్యమంత్రిగా మారిన వైనం దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించింది.
నిఖిల్‌ హీరోగా, చందూ మొండేటి దర్శకతంలో అభిషేక్‌ అగర్వాల్‌ నిర్మించిన చిత్రం ‘కార్తికేయ 2’. 70వ జాతీయ చలన చిత్ర పురస్కారాల్లో ఈ సినిమా జాతీయ ప్రాంతీయ ఉత్తమ తెలుగు చిత్రంగా పురస్కారాన్ని దక్కించుకుంది.
పాన్‌ ఇండియా మార్కెట్‌లో ఈ ఏడాది మన తెలుగు సినిమాలు భారీ వసూళ్ళతో సంచలన విజయాలను నమోదు చేసుకున్నాయి.
కేవలం 21 రోజుల్లో రూ.1705 కోట్ల రూపాయలను కలెక్ట్‌ చేసి ‘పుష్ప 2 : ది రూల్‌’ సినిమా సరికొత్త రికార్డ్‌ నెలకొల్పింది. అంతేకాదు దేశ సినిమా చరిత్రలోనే అరుదైన రికార్డ్‌ని సొంతం చేసుకుంది. వందేళ్ల బాలీవుడ్‌ సినిమాల కలెక్షన్లని సైతం ఈ సినిమా దాటేసి, అక్కడ కూడా తెలుగు సినిమా సత్తా ఏమిటో నిరూపించింది. సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా భారీ కలెక్షన్లను కొల్లగొట్టింది. సినిమా ప్రదర్శన ఇంకా కొనసాగుతుండటంతో ఇది కచ్చితంగా రూ.2 వేల అల్లుఅర్జున్‌, సుకుమార్‌ కాంబినేషన్‌లో రూపొందిన చిత్రం ‘పుష్ప’. ఈ సినిమా సైతం విశేష ప్రేక్షకాదరణ పొంది, మంచి కలెక్షన్లని సొంతం చేసుకుంది. ఇదే సినిమాలోని నటనకు జాతీయ ఉత్తమ నటుడిగా అల్లుఅర్జున్‌ ఎంపికయ్యారు. ఇది కూడా రికార్డే. ఇన్నేళ్ళ భారతీయ చలన చిత్ర పురస్కారాల చరిత్రలో ఏ తెలుగు నటుడు ఇంత వరకు జాతీయ ఉత్తమ నటుడిగా ఎంపికవ్వలేదు. ఈ అరుదైన ఫీటు సాధించిన నటుడిగా అల్లుఅర్జున్‌ నిలిచారు. ‘పుష్ప’కి సీక్వెల్‌గా రూపొందిన ‘పుష్ప 2’ చిత్రం ఇప్పుడు వరల్డ్‌వైడ్‌గా అనూహ్య కలెక్షన్లతో వీరవిహారం చేస్తోంది.

ఇక ప్రభాస్‌ ‘కల్కి 2898 ఏడి’ సినిమాతో మరోసారి వెయ్యి కోట్ల క్లబ్‌లోకి చేరారు. ‘బాహుబలి 2, కల్కి’ సినిమాలతో వెయ్యి కోట్ల క్లబ్‌లోకి రెండుసార్లు చేరిన తొలి దక్షిణాది కథానాయకుడిగా ప్రభాస్‌ నిలిచారు. అమితాబ్‌ బచ్చన్‌, దీపికాపదుకొనె వంటి హేమాహేమీలతో నాగ్‌అశ్విన్‌ తెరకెక్కించిన ఈ సినిమా వసూళ్ళ పరంగా పాన్‌ ఇండియా స్థాయిలో సత్తా చాటింది.

ఎన్టీఆర్‌, కొరటాల శివ కాంబినేషన్‌లో రూపొందిన చిత్రం ‘దేవర 1’. ఈ సినిమా దాదాపు రూ.450 కోట్ల గ్రాస్‌ని కలెక్ట్‌ చేసింది. దేవర, వర రెండు పాత్రలతో ఎన్టీఆర్‌ ప్రేక్షకుల్ని అలరించారు. ఈ సినిమాకి కొనసాగింపుగా ‘దేవర పార్ట్‌ 2’ త్వరలోనే తెరకెక్కనుంది.

మహేష్‌బాబు, త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో వచ్చిన మూడవ సినిమా ‘గుంటూరు కారం’. ‘అతడు’, ‘ఖలేజ’ తర్వాత వీరి కాంబోలో వస్తున్న సినిమా కావడంతో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే టాక్‌ పరంగా ఈ సినిమా ఆ అంచనాలను అందుకోలేక పోయింది. కానీ కలెక్షన్ల పరంగా డీసెంట్‌గా నెంబర్స్‌ని కలెక్ట్‌ చేసింది. బాక్సాఫీస్‌ దగ్గర దాదాపు రూ.180 కోట్ల గ్రాస్‌ని రాబట్టింది.

పాన్‌ ఇండియాలో స్థాయిలో బాగా హల్‌చల్‌ చేసిన తెలుగు సినిమాగా ‘హను-మాన్‌’ నిలిచింది. తేజ సజ్జా, ప్రశాంత్‌ వర్మ కాంబినేషన్‌లో రూపొందిన ఈ సూపర్‌హీరో సినిమా ఏకంగా రూ.350 కోట్ల గ్రాస్‌ని కలెక్ట్‌ చేసి, అందర్నీ సర్‌ప్రైజ్‌ చేసింది. స్టార్లు లేకపోయినా కథలో స్ట్రాంగ్‌ కంటెంట్‌ ఉంటే సాలీడ్‌ కలెక్షన్లను కొల్లగొట్టొచ్చని ఈ సినిమా ఫ్రూవ్‌ చేసింది.
అనేక వివాదాలు ఈ ఏడాది టాలీవుడ్‌ని హెడ్‌ లైన్స్‌లో నిలిపాయి.
యువ కథానాయకుడు రాజ్‌ తరుణ్‌ పై లావణ్య అనే యువతి చీటింగ్‌ కేసు పెట్టింది. పదేళ్ళు తనతో సహజీవనం చేసి, చాలాసార్లు గర్భం తీయించి, తనని అన్ని విధాలుగా దారుణంగా మోసం చేశాడని రాజ్‌ తరుణ్‌ పై లావణ్య తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేసింది. ఆమె పోలీసులను ఆశ్రయించడంతో ఈ వివాదం హాట్‌ టాపిక్‌గా మారి, చాలా రోజులు హల్‌చల్‌ చేసింది.
లైంగిక వేధింపుల కేసులో జానీ మాస్టర్‌ అరెస్ట్‌ అయ్యారు. ఆయనపై తన సహాయకురాలు శ్రష్టి శర్మ ఈ కేసు పెట్టింది. బెయిల్‌ మీద ఆయన బయటికి వచ్చినప్పటికీ తనకి వచ్చిన జాతీయ అవార్డుని కేంద్రం వెనక్కి తీసుకోవడంపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది. 70వ జాతీయ చలన చిత్ర పురస్కారాల్లో ఉత్తమ కొరియోగ్రాఫర్‌గా ‘మేఘం కారుకథ..’ పాటకు జానీ మాస్టర్‌ ఎంపికయ్యారు.
నటుడు మోహన్‌బాబు కుటుంబ కలహాలు రచ్చ కెక్కాయి. కొన్నాళ్ళుగా సైలెంట్‌గా ఉన్న కుటుంబ గొడవలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. మోహన్‌బాబు తనచిన్న కొడుకు మనోజ్‌ వలన హాని ఉందని కేసు పెడితే, దీనికి ప్రతిగా మనోజ్‌ ఆయనపై కేసు పెట్టాడు. పదిపేజీల లేఖ రిలీజ్‌ చేశాడు. ఆస్తుల కోసం కాదు ఇది తన ఆత్మగౌరవ పోరాటం అన్నాడు. మీడియాని వెంటబెట్టుకొని మోహన్‌బాబు ఇంటికి వెళ్ళాడు. ఈ గొడవలో సహనం కోల్పోయిన మోహన్‌ బాబు మీడియా ప్రతినిధి పై దాడి చేశారు. ఈ దాడి నేపథ్యంలో మోహన్‌బాబుపై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేశారు. అలాగే మీడియాపై మోహన్‌బాబు దాడి చేయడంపై జర్నలిస్టులు సైతం తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. దీంతో ఈ ఇష్యూ హాట్‌ టాపిక్‌గా మారింది.
ఓ సినిమా విడుదల సందర్భంగా టీడీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌పై వర్మ కించపరిచేలా పోస్టులు చేశారనే ఫిర్యాదు రావడంతో దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మపై ఏపీ పోలీసులు కేసు నమోదు చేశారు. అలాగే నటి కస్తూరి తెలుగు ప్రజలపై చేసిన వాఖ్యలు వివాదస్పదమవ్వడంతో ఆమెపై కేసులు నమోదయ్యాయి.
‘పుష్ప 2 : ది రూల్‌’ సినిమాతో సరికొత్త రికార్డులు సృష్టించిన అల్లుఅర్జున్‌ అరెస్ట్‌ నేషనల్‌ లెవెల్‌లో సంచలనం అయ్యింది. ‘పుష్ప2’ బెనిఫిట్‌ షో సమయంలో జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ చనిపోయింది, ఆమె కొడుకు శ్రీతేజ్‌ తీవ్రంగా గాయపడి చావుబతుకుల మధ్య చికిత్స పొందుతున్నాడు. ఏది ఏమైనప్పటికీ ‘పుష్ప2’ ఇచ్చిన విజయం కంటే ఈ విషాదమైన వివాదమే దేశవ్యాప్తంగా సంచలనంగా మిగిలింది.