సత్ఫలితాలిస్తున్న ‘ప్రజావాణి’

– నిరుపేద చిన్నారికి ఆపరేషన్‌ చేయించిన అధికారులు
– సీఎం రేవంత్‌రెడ్డి ట్వీట్‌
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
ప్రజాప్రభుత్వం ఏర్పాటు చేసిన ‘ప్రజావాణి’ కార్యక్రమం సత్ఫలితాలు ఇస్తున్నదని ముఖ్యమంత్రి ఏ రేవంత్‌రెడ్డి ఎక్స్‌ వేదికగా ట్వీట్‌ చేశారు. సైదాబాద్‌కు చెందిన జుమాన్‌బీ భర్త 8ఏండ్ల క్రితం మరణించారు. ఆమె కుమార్తె బిస్మిల్లా బీ (16)కి మెడకు ఎడమవైపు వాచి గడ్డ ఏర్పడింది. కాన్సర్‌ అయ్యిండొచ్చని ప్రయివేటు ఆస్పత్రి వైద్యులు చెప్పారు. చికిత్స కోసం రూ.2 లక్షల వరకు ఖర్చు అవుతాయని అంచనా వేసి ఇచ్చారు. చిన్న కిరాణా దుకాణం నడుపుకుంటున్న జుమాన్‌ బీ తనకు అంతటి ఆర్థిక స్థోమత లేదని పేర్కొంటూ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజావాణి కార్య క్రమంలో దరఖాస్తు చేసుకున్నారు. ప్రజావాణి నోడల్‌ అధికారి దివ్యా దేవ రాజన్‌ ఆమె విజ్ఞప్తిని అంగీకరిస్తూ కామినేని ఆస్పత్రిలో బిస్మిల్లా బీని చేర్పించారు. ఉచితంగా ఆమెకు చికిత్స అందించి, అనంతరం అంబు లెన్స్‌లో ఆమెను ఇంటికి చేర్చారు. ఈ సందర్భంగా బిస్మిల్లా బీ ముఖ్యమంత్రి ఏ రేవంత్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతూ లేఖ రాసింది. దీనిపై సీఎం స్పందిస్తూ సత్వరం స్పందించి, మెరుగైన వైద్యం అందించి, ఆమె ప్రాణాలు కాపాడిన ప్రజావాణి అధికారులను అభినందించారు. అలాగే బిస్మిల్లాబీ ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుతూ శుభాకాంక్షలు తెలిపారు.