వారసుల విజయం..

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
పార్లమెంట్‌ ఎన్నికల్లో తెలంగాణ నుంచి నలుగురు రాజకీయ వారసలు బరిలో నిలిచారు. పెద్దపల్లి నుంచి గడ్డం వంశీ, వరంగల్‌ నుంచి కడియం కావ్య, నల్గొండ నుంచి రఘువీర్‌రెడ్డి కాంగ్రెస్‌ నుంచి పోటీ చేయగా..ఈ ముగ్గురూ ఘన విజయం సాధించారు. నాగర్‌ కర్నూల్‌ నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన సిట్టింగ్‌ ఎంపీ రాములు తనయుడు భరత్‌ కాంగ్రెస్‌ చేతిలో ఓటమిపాలయ్యారు. కాంగ్రెస్‌ తరపున నల్గొండ నుంచి పోటీ చేసిన రఘువీర్‌రెడ్డి మాజీ మంత్రి కె జానారెడ్డి తనయుడు. ఆయన సమీప బీజేపీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డిపై సుమారు 5.51లక్షల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. రెండు తెలుగు రాష్ట్రాల చరిత్రలో ఇదే అత్యధికం. 2011లో కడప లోక్‌సభ ఉప ఎన్నికల్లో 5.43 లక్షల మెజార్టీతో వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి గెలవగా..అంతకు మించిన మెజార్టీతో రఘువీర్‌రెడ్డి ఇప్పుడు విజయం సాధించటం విశేషం. పెద్దపల్లి పార్లమెంట్‌ నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసిన చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్‌ కుమారుడు, మాజీ కేంద్ర మంత్రి దివంగత నేత వెంకటస్వామి మనుమడు గడ్డం వంశీకృష్ణ తన ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి గోమాస శ్రీనివాస్‌పై 1.31లక్షలకు పైగా మెజార్టితో విజయం సాధించారు. వరంగల్‌ నుంచి బరిలోకి దిగిన మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి కుమార్తె కడియం కావ్య తన సమీప ప్రత్యర్థి ఆరూరి రమేశ్‌పై రెండు లక్షల ఓట్లతో విజయం సాధించారు.