ఇలాంటి క్లైమాక్స్‌ రాలేదు

ఇలాంటి క్లైమాక్స్‌ రాలేదురక్షిత్‌ అట్లూరి, కోమలీ ప్రసాద్‌ హీరో, హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘శశివదనే’. గౌరీ నాయుడు సమర్పణలో ఏజీ ఫిల్మ్‌ కంపెనీ, ఎస్‌.వి.ఎస్‌. స్టూడియోస్‌ బ్యానర్స్‌పై అహితేజ బెల్లంకొండ, అభిలాష్‌ రెడ్డి గోడల నిర్మించారు. గోదావరి నేపథ్యంలో లవ్‌ అండ్‌ యాక్షన్‌ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాకు సాయి మోహన్‌ ఉబ్బర దర్శకత్వం వహించారు. ఏప్రిల్‌ 19న సినిమా రిలీజ్‌ అవుతుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో చిత్ర సమర్పకురాలు గౌరీ నాయుడు మాట్లాడుతూ, ‘రక్షిత్‌, కోమలీ, నిర్మాతలు అభిలాష్‌, అహితేజ సహా సపోర్ట్‌ చేసిన అందరికీ థ్యాంక్స్‌’ అని అన్నారు. ‘రక్షిత్‌ అట్లూరి, కోమలి చక్కగా నటించారు. సాంగ్స్‌, టీజర్‌ అందరికీ నచ్చాయి. అలాగే సినిమాను కూడా పెద్ద హిట్‌ చేస్తారని నమ్ముతున్నాను’ అని నిర్మాత అభిలాష్‌ రెడ్డి అన్నారు. దర్శకుడు సాయి మోహన్‌ ఉబ్బర మాట్లాడుతూ, ‘ఇప్పటి వరకు విడుదలైన టీజర్‌, మూడు పాటలకు ప్రేక్షకుల నుంచి చాలా మంచి రెస్పాన్స్‌ వచ్చింది. సినిమా టైటిల్‌, పాటలు ఎంత సాప్ట్‌గా అనిపిస్తున్నాయో సినిమా అంత హార్డ్‌ హిట్టింగ్‌గా ఉంటుంది. మూవీ చూసిన తర్వాత ఓ ఆలోచనతో ఆడియెన్స్‌ బయటకు వస్తారు’ అని తెలిపారు. ‘అందరూ ఇచ్చిన సపోర్ట్‌తో మార్కెట్‌లో మా సినిమాకు ఓ మార్క్‌ వచ్చింది. ఇలాంటి క్లైమాక్స్‌తో సినిమా ఇప్పటి వరకు రాలేదని నేను చెప్పగలను’ అని నిర్మాత అహితేజ బెల్లంకొండ అన్నారు. హీరో రక్షిత్‌ అట్లూరి మాట్లాడుతూ, ‘సినిమా ఫస్ట్‌ కాపీ చూసుకుని కాన్ఫిడెంట్‌గా ఉన్నాం. సినిమా చాలా బ్రహ్మాండంగా వచ్చింది’ అని చెప్పారు.