హీరో కార్తీ నటిస్తున్న తన 25వ చిత్రం ‘జపాన్’. ‘జోకర్’ ఫేమ్ రాజు మురుగన్ దర్శకుడు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ పతాకంపై ఎస్ ఆర్ ప్రకాష్ బాబు, ఎస్ ఆర్ ప్రభు నిర్మించారు. అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ దీపావళి కానుకగా ఈనెల 10న తెలుగు రాష్ట్రాల్లో గ్రాండ్‌గా థియేటర్స్‌లో రిలీజ్ చేయనుంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీరిలీజ్ ఈవెంట్‌కి హీరో నాని ముఖ్య అతిథిగా, దర్శకుడు వంశీ పైడిపల్లి, సుప్రియ యార్లగడ్డ అతిథులుగా పాల్గొన్నారు.
నాని మాట్లాడుతూ, ‘కార్తి ప్రతి సినిమాకి కొత్తదనం చూపిస్తూ వరుస విజయాలు అందుకున్నారు. ఇప్పుడు ఈ సినిమాతో మరింత షాకింగ్ గెటప్‌తో మన ముందుకు వస్తున్నారు. ఇలాంటి సినిమాలు చేయడం, చేసి ఒప్పించడం అంత తేలిక కాదు. ట్రైలర్ చూస్తుంటే చాలా ఎనర్జీ కనిపిస్తుంది. ఈ సినిమా చాలా పెద్ద విజయం సాధించాలి’ అని అన్నారు.
‘సినిమాని ఒక పండగలా చూస్తారు తెలుగు ఆడియన్స్. జపాన్ డిఫరెంట్ మూవీ. కార్తి పాత్ర అద్భుతంగా ఉంటుంది. సునీల్‌తో పని చేయడం మంచి అనుభూతి’ అని దర్శకుడు రాజు మురుగన్ తెలిపారు. ‘డ్రీమ్ వారియర్ పిక్చర్స్‌కి నేషనల్ అవార్డ్ తెచ్చిపెట్టిన దర్శకుడు రాజు మురగన్‌తో ఈ చిత్రం చేయడం చాలా ఆనందంగా ఉంది. ఈ చిత్రం ఆయన స్టాంప్‌లో ఉంటుంది. గత ఏడాది దీపావళికి కార్తి ‘సర్దార్’ని అన్నపూర్ణ స్టూడియోస్ విడుదల చేసింది. మళ్ళీ ఈ ఏడాది దీపావళికి ‘జపాన్’ విడుదల చేయడం విశేషం. సుప్రియకి థ్యాంక్స్’ అని నిర్మాత ఎస్ ఆర్ ప్రభు చెప్పారు.
‘సర్దార్’ తర్వాత అన్నపూర్ణ స్టూడియోస్ ఈ చిత్రాన్ని విడుదల చేయడం చాలా ఆనందంగా ఉంది. మన కల్చర్‌లో ఉండిపోయే బలమైన కథతో ఈ సినిమా చేశాం. దీనిని ఇంటర్నేషనల్ లెవల్‌లో ప్రజెంట్ చేయడానికి పెద్ద టెక్నీషియన్స్‌ని తీసుకొచ్చాం. ఈ చిత్రం నా మనసుకు దగ్గరైన చిత్రం. రాజు మురగన్ సమాజం పట్ల ప్రేమ ఉన్న దర్శకుడు. జపాన్ పాత్రలో స్వార్ధం ఉంటుంది. ఈ సమాజం తనకి ఏది ఇచ్చిందో అదే తిరిగి ఇచ్చే పాత్ర తనది. వినోదంతో పాటు ఆలోచింపజేసే ప్రశ్నలు సంధించే చిత్రమిది. ఖైదీ చూసినప్పుడు ఎలా సర్‌ప్రైజ్ అయ్యారో ఈ సినిమా చూసి కూడా అలానే సర్‌ప్రైజ్ అవుతారు.
– హీరో కార్తి