‘నేను పనిచేసిన గత చిత్రాలు కాలా, సార్పట్ట వంటివి చూస్తే రా అండ్ రస్టిక్ గా ఉంటాయి. కానీ ‘ఖుషి’లో బ్యూటిఫుల్ ఫీల్ గుడ్ విజువల్స్ తెరపైకి తీసుకొచ్చే అవకాశం కలిగింది. ఫుల్ లైఫ్ తెరపై చూపిస్తున్న ఫీలింగ్ కలిగింది. ఈ సినిమా చూడటం పూర్తయ్యాక మీకొక కొత్త అనుభూతి కలుగుతుంది. కెమెరా ద్వారా ఆ ఎమోషన్ తీసుకొచ్చేందుకు నా ప్రయత్నం చేశాను’ అని సినిమాటోగ్రాఫర్ జి.మురళి అన్నారు.
విజరు దేవరకొండ, సమంత జంటగా నటించిన చిత్రం ‘ఖుషి’. శివ నిర్వాణ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మించారు. సెప్టెంబర్ 1న ఈ సినిమా గ్రాండ్‌గా రిలీజ్ అయ్యేందుకు రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో సినిమాటోగ్రాఫర్ జి.మురళి మీడియాతో మాట్లాడుతూ, ‘ప్రేమ గురించి కొన్ని కలలు కనే యువకుడికి లవ్, లైఫ్ అంటే మన ఊహలకు అనుగుణంగా ఉండదని తెలిసిరావడమే ఈ సినిమా నేపథ్యం. మణిరత్నం సినిమాల్లో సినిమాటోగ్రాఫర్ పీసీ శ్రీరామ్ చూపించే విజువల్ బ్యూటీ ఈ చిత్రంలో చూస్తారు. అయితే అలాంటి సీన్స్‌ను మేము కాపీ కొట్టలేదు(నవ్వుతూ). అలాంటి ఫీల్ కలిగించేలా విజువల్స్ ఉంటాయి. శివ నిర్వాణ సినిమా మేకింగ్ మీద ఇష్టం ఉన్న దర్శకుడు. ఆయన మ్యూజిక్ సెన్స్ సూపర్బ్. ఇవాళ ‘ఖుషి’లో ఇంతమంచి మ్యూజిక్ వచ్చిందంటే దానికి ఆయన మ్యూజిక్ టేస్టే కారణం. ఇందులో విప్లవ్, ఆరాధ్య క్యారెక్టర్‌లలో విజరు, సమంత నటన మిమ్మల్ని ఎంతగానో ఆకట్టుకుంటుంది’ అని తెలిపారు.