అవినీతి.. ఉద్యోగి చేతిలో సుదర్శన అస్త్రం

Corruption– ఇంక్రిమెంట్ల పేరుతో వసూళ్లు
– పోస్టింగుల పేరుతో దావత్ లు..
– తవ్వేకొద్ది బయటపడుతున్న అక్రమాలు..
– కలెక్టరేట్ లో ఏ ఉద్యోగిని కదిలించినా.. బయట పెడుతున్న వారి భాగోతలు..
నవతెలంగాణ – సూర్యాపేట కలెక్టరేట్
సూర్యాపేట కలెక్టరేట్ లోని రెవెన్యూశాఖ లోని ఓ విభాగంలో పని చేస్తున్న అధికారి,సిబ్బంది అక్రమాలు తవ్వేకొద్ది బయటపడుతున్నాయి.ఉద్యోగుల నుండి పెద్ద ఎత్తున వసూళ్ల పర్వం చేసినట్లు సమాచారం. ప్రతి పనికి ఒక రేట్ ఫిక్స్ చేసుకొని అక్రమాలకు పాల్పడుతున్న ఆ ఉద్యోగుల తీరు పై సిబ్బంది కలెక్టరేట్ లో పని చేయాలంటేనే జంకు తున్నారు. దీనికి తోడు ఆయన చేతిలో సుదర్శన అస్త్రం తోడు ఉండడంతో ఏ సిబ్బంది అయినా గట్టిగా అడిగితే ఆ సిబ్బందిపై చర్యలు తీసుకుంటారనే భయాందోళనలో ఉన్నారు.ఇంక్రిమెంట్లు, పోస్టింగులు, ట్రాన్స్ఫర్, బిల్లులు సంక్షన్ ఇలా అన్ని ఫైల్స్ వారి చేతుల్లోనే ఉండడంతో రెవెన్యూశాఖలో వారి ఆడిందే ఆట పాడింది పాటగా నడుస్తుందని కలెక్టరేట్ లోని కొంతమంది ఉద్యోగులు ఆవేదన చెందుతున్నారు.ఆ అవినీతి ఉద్యోగి చేతులో సుదర్శన అస్త్రం ఉండడంతో భారీగా అక్రమాలకు పాల్పడుతున్నారన్న విమర్శలు ఉన్నాయి.
ఇంక్రిమెంట్ల పేరుతో అడ్డగోలుగా వసూళ్లు..
కలెక్టరేట్ లో పని చేస్తున్న సిబ్బందికి రావాల్సిన ఇంక్రిమెంట్లు ఇవ్వాలంటే రూ.15వేల నుండి రూ.30వేల వరకు వసూళ్లు చేయగా పోస్టింగ్ ల కొరకు రూ.20 వేల నుండి రూ.50వేల వరకు అడ్డగోలుగా వసూళ్లు చేశారని సమాచారం.అంతేకాకుండా ఇద్దరు కలిసి రెవెన్యూశాఖలోని ఉద్యోగుల పోస్టింగ్, డిప్యుటేషన్ పేర్లతో అందినకాడికి దోచుకున్నరన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.అడిగిన అంతా ఇవ్వకపోతే చాలా మంది ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు పెండింగ్ లోనే పెట్టారని పలువురు ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
బార్ లో సెటిల్ మెంట్లు..
ఏ పని కావాలన్న కలెక్టర్ బంగ్లాకు కూత వేటు దూరంలో ఉండే ఒక బార్ లో సదరు ఉద్యోగి సెటిల్ మెంట్ అడ్డాగా మార్చుకొని సాయంత్రం నుండి అర్ధరాత్రి వరకు అక్కడే అక్రమాలకు పాల్పడుతున్నారు.డబ్బులతో పాటు ధవత్ ల పేరుతో అదనంగా వసూళ్లకు పాల్పడుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.ఇటీవల ఒక అటెండర్ పోస్టింగ్ కోసం రూ.30వేలతో పాటు ఒక ఖరీదైన మద్యం బాటిల్ డిమాండ్ చేసి మరి ఇప్పించుకున్నట్లు సమాచారం.
మచ్చుకు కొన్ని..
కలెక్టరేట్ లోని ఒక విభాగంలో పని చేస్తున్న ఒక ఉద్యోగికి రావాల్సిన ఇంక్రిమెంట్ల కోసం నెలల తరబడి పెండింగ్ లోనే పెట్టడంతో చేసేది ఏమీ లేక రూ.20వేలు ఇచ్చుకున్నారు సమాచారం.
ఇటీవల ఒక ఉద్యోగి అలసత్వం వహిస్తున్నడని కలెక్టర్ షోకాజ్ నోటీసులు ఇవ్వాలని ఆదేశాలు ఇవ్వడంతో దాన్ని ఆసరాగా చేసుకుని సదరు అవినీతి అధికారి,ఆ ఉద్యోగి కి షోకాజ్ నోటీసుల పేరుతో వేధింపులకు పాల్పడుతుండడంతో రూ.30వేలు సమర్పించుకున్నాడని సమాచారం.
కలెక్టరేట్ లో పని చేస్తున్న ఒక ఉద్యోగిని కోదాడ నియోజకవర్గనికి ట్రాన్స్ఫర్ చేయగా డిప్యుటేషన్ కొరకు రూ.15వేలు రూపాయలను కూడా వసూళ్ళు చేశారు ఆరోపణలు ఉన్నాయి.