నవతెలంగాణ – సూర్యాపేట కలెక్టరేట్
జిల్లా కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో గత ఐదు రోజులుగా నిర్వహిస్తున్న విశేష ఉత్సవాలలో భాగంగా శనివారం సుదర్శన జయంతిని పురస్కరించుకొని సుదర్శన మహా యాగాన్ని అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు నల్లాన్ చక్రవర్తుల వేణుగోపాలచార్యుల ఆధ్వర్యంలో తెల్లవారుజామునే స్వామివారికి ప్రత్యేక పంచామృత అభిషేకములు నిర్వహించి శ్రీ సుదర్శన యాగానికి అంకురార్పణ చేశారు తదనంతరం అగ్నిప్రతిష్ట నిర్వహించి సుదర్శన మహా యాగం నిర్వహించారు. భక్తులు శ్రావణ శనివారం కావడంతో అత్యంత భక్తిశ్రద్ధలతో స్వామివారిని దర్శించి తరించారు ఈ సందర్భంగా శ్రీ సుదర్శన శతక పారాయణం నిర్వహించి మూల మంత్ర హోమాలు నిర్వహించి మహా పూర్ణాహుతి జరిపారు. తదనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు తదియారాధన అన్న ప్రసాదం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణ అధికారి వై శ్రీనివాసరెడ్డి అర్చకులు సంకర్షణాచార్యులు శ్రీహరిచార్యులు ఫణికుమార్ ఆచార్యులు ఉపేంద్ర ఆచార్యులు ఆండాళ్ గోష్ఠి భక్త బృందం మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమం విజయవంతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కెనరా బ్యాంక్ మేనేజర్ శ్రీ వెంకట ఫణీంద్ర శర్మ దంపతులు మరియు పాలవరపు రామ్ కుమార్ దంపతులు భక్తులకు అన్న ప్రసాదం అందజేశారు. ఈ కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహించిన భక్తులకు వేణుగోపాలాచార్యులు వేద ఆశీస్సులు అందజేశారు.