నవతెలంగాణ-ముషీరాబాద్
తెలంగాణ ప్రజా సాంస్కృతిక కేంద్రం(టీపీఎస్‌కే) ఆధ్వర్యంలో శనివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ప్రముఖ సినీ గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ రచించిన అశో’కవనం’ కావ్య పఠనం జరిగింది. ఈ సందర్భంగా సుద్దాల అశోక్ తేజ 6 గంటలపాటు ఏక కంఠ పఠనం చేశారు. భూపతి వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో సుద్దాల అశోక్‌తేజ మాట్లాడుతూ త్రేతయుగం నుంచి నేటి వి’కృత’యుగం దాకా, పురాణ కాలం నుంచి ఈనాటి కరోనాల కాలం దాకా, తనయుడిచే నిలువున చంపబడిన రేణుక దేవి నుంచి నిందితుల్ని నిలబెట్టి కాల్చిన పూలన్‌దేవి దాకా, శ్రీరాముని చేత తలనరకబడిన శంభూకుడి నుంచి శ్రీకృష్ణుని మాయోపాయాల వలన తల నరుక్కున్న భార్బరీకుని దాకా, సార్వభౌముల జులుం నుంచి సాల్వ జులుం దాకా జరిగిన దారుణాలు, మారణాలు, వాటి వాటి కారణాలు, మరికొన్ని మమకారాలు, వికారాల సమస్తము నిక్షిప్తం చేసిన అశోకవనం అభివేక్తం చేస్తుందని.. ఆశో ”కవనం” భావితరాలకు ఇది ఆశా కవనం అని కావ్య గానం చేశారు. భూపతి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఎవరూ చూడని అనేక కోణాల్లో చరిత్రను తన అశో’కవనం’ కావ్య గానంలో తేజ చెప్పారని తెలిపారు .ఈ కార్యక్రమంలో మోత్కూరి నరహరి, జి. రాములు, కోయ కోటేశ్వరరావు, కె.అనందాచారి, జీ మహేందర్, వనం సుధాకర్, అరిబండి ప్రసాద్ రావు, ఐతగొని విజరు, మూర్తి సామల రమేష్ తదితరులు పాల్గొన్నారు.