పోలీస్‌ స్టేషన్ల పనితీరు మెరుగు కోసం ఉన్నతాధికారుల ఆకస్మిక తనిఖీలు

–  కార్యాచరణ రూపొందిస్తున్న డీజీపీ హెడ్‌క్వార్టర్‌
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి :
పోలీసు స్టేషన్ల పనితీరును మరింతగా మెరుగుపర్చటానికి తీసుకోవాల్సిన చర్యలపై డీజీపీ హెడ్‌క్వార్టర్స్‌లోని అధికారులు దృష్టిని సారించారు. దీనికి సంబంధించి కార్యచరణ రూపొందించి అమలు పర్చటానికి సన్నాహాలు ప్రారంభించినట్టు తెలిసింది. రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారం లోకి వచ్చాక నూతన డీజీపీ డాక్టర్‌ రవి గుప్తా మాట్లాడుతూ.. ప్రజలతో స్నేహపూర్వకంగా పోలీసులు వ్యవహరిస్తారనీ, అదే సమయంలో నేరస్థులు, చట్ట వ్యతిరేకులు, రౌడీలు, గూండాలపై కఠినంగా వ్యవహరించటం జరుగుతుందని తమ వైఖరిని స్పష్టం చేశారు. అదే సమయంలో పేద ప్రజలకు చట్టపరంగా అన్ని విధాలా చేయూత నందించి బాధితులకు న్యాయం చేకూర్చటమే లక్ష్యంగా పని చేస్తామన్నారు. ఈ లక్ష్య సాధన దిశగా పోలీసు స్టేషన్ల పని తీరును మరింతగా మెరుగుపర్చటానికి వీటిపై ఉన్నతాధికారుల పర్యవేక్షణను పెంచాలని డీజీపీ యోచిస్తున్నట్టు తెలిసింది. ఇందులో భాగంగా పోలీసు స్టేషన్లలో కింది స్థాయి అధికారులు, సిబ్బంది తాము సూచిం చిన మార్గదర్శకాలకు అనుగుణంగా పని చేస్తున్నారా? లేదా ? అనేది ప్రత్యక్షంగా పర్య వేక్షించేలా చూడటానికి యాక్షన్‌ ప్లాన్‌ను రూపొంది స్తున్నట్టు తెలిసింది. ఇందులో భాగంగానే నెలలో ఒకసారైనా సీనియర్‌ పోలీసు అధికారులు పోలీసు స్టేషన్లలో ఆకస్మిక తనిఖీలను నిర్వహించేలా ప్రణాళికను రూపొందిస్తున్నట్టు సమాచారం. జిల్లాల ఎస్పీలు, నగర పోలీసు కమిషనర్లేగాక డీజీపీ హెడ్‌క్వార్టర్స్‌ నుంచి కూడా ఉన్నతాధికారుల ద్వారా ఆకస్మిక తనిఖీలను నిర్వహించటానికి ప్రణాళికలను రూపొంది స్తున్నారని తెలిసింది. ఇటీవలనే సైబరాబాద్‌ పోలీసు కమిషనరేట్‌ పరిధిలోని రాజేంద్రనగర్‌ పోలీస్‌ స్టేషన్‌కు దేశంలోనే బెస్ట్‌ పోలీసు స్టేషన్‌గా అవార్డు లభించి న నేపథ్యాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని అటువంటి అవార్డులను ప్రతి ఏడాదీ రాష్ట్రానికి దక్కించుకు నేలా కూడా అధికారులు వ్యూహ రచన చేస్తున్నట్టు సమాచారం. దానికనుగుణంగానే ప్రతి జిల్లాలో ఒక పోలీసు స్టేషన్‌ను ఈ అవార్డుకు ఎంపికయ్యేలా జిల్లా ఎస్పీలు, నగర పోలీసు కమిషనర్లకు దిశానిర్దేశం చేయనున్నారని కూడా తెలిసింది. ముఖ్యంగా, పోలీసు స్టేషన్లలో ఎక్కడ కూడా పోలీసుల అతి చర్య కారణంగా లాకప్‌డెత్‌లు, కస్టోడియల్‌ డెత్‌లు జరగకుండా చూసేందుకు సైతం కిందిస్థాయి అధికారులు, సిబ్బందికి తగిన సూచనలు, సలహాలు ఇవ్వటమేగాక అందుకు సంబంధించిన శిక్షణను కూడా ఇవ్వటానికి సిద్ధమవుతున్నట్టు సమాచారం. ఈ విషయంలో సీనియర్‌ పోలీసు అధికారులతో డీజీపీ రవిగుప్తా సంప్రదింపులు జరుపుతున్నట్టు తెలిసింది.