సూఫీ పద్యం

వాకింగ్‌ అంటే
పొద్దున సాయంత్రం
పార్కుల్లోనో సర్వీసు రోడ్డుమీదో
కాలుకొద్ది తిరిగి రావటం అనే
తెలుసు మనకు-

సంభాషణ అంటే
పక్కనున్నపుడో ఎదురుపడినప్పుడో
ఇరుగుపొరుగుతో ఏదో ఒక మతలబును
వీలుకొద్ది పంచుకోవడం అనే గుర్తు మనకు-

నేను ముప్పై ఏండ్లకు పైగా
ఉదయ సాయంత్రాలు నడుస్తూ ఉండటాన్నే
బాగున్నానంటున్నాడొకాయన
తేనీటి రసభాషణంలో-

సమీపం దూరం
ఏ కరచాలనాన్ని నిరాదరించింది లేదు
ఆరుపదుల జీవికలో
సహవాసులు నాకో లాగరిథం పట్టిక
అంటున్నాడొకాయన
వాకరిని తనక్కూడా నడిపిస్తూ-

అబద్ధాల్ని నిజాలుగా రక్తికట్టించే
నీతిబాహ్యపు లోకాన
కట్టుకథలతో సత్యాన్ని తుదముట్టించే
విలోమ జగత్తులో
తన లోపలకు తను నడవకుండా
తనతో తను మాట్లాడుకోకుండా
మనిషి

బయట ఎన్నేండ్లు నడుస్తూ
ఎంత మందితో
ఎంత సుదీర్ఘంగా సంభాషించినా
బాగుండేది
బావుకునేది
వట్టి గుండుసున్నా అన్నాడో సూఫీ
అత్తర్‌ పద్యమొకటి ఆలాపిస్తూ-

ఆడంబరం తెర చించి
అహంభావం చెర విడిపించి
నడకనూ పలకరింపునూ
ముర్షిద్‌ వెనకాల ముస్తాబు చేయడానికి
సమయం లేదాయె.

– డా.బెల్లి యాదయ్య
9848392690