ఇస్తాంబుల్ : టర్కీ పార్లమెంట్ భవనం సమీపంలో ఆదివారం ఉదయం ఆత్మాహుతి దాడి జరిగింది. ఆ దేశ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ కార్యాలయానికి సమీపంలోనే ఈ పేలుడు జరిగినట్టు అధికారులు తెలిపారు. ఈ దాడిలో ఇద్దరు పోలీసు అధికారులు గాయపడ్డారని టర్కీ అంతర్గత వ్యవహారాల మంత్రి అలీ యెర్లికయ వెల్లడించారు. ఆదివారం ఉదయం ఓ వాహనంలో వచ్చిన ఇద్దరు ఉగ్రవాదులు పార్లమెంట్ వద్ద ఇంటీరియర్ మంత్రిత్వశాఖ భవనంలో ఉన్న సెక్యూరిటీ జనరల్ డైరెక్టరేట్ కార్యాలయం గేటు వద్ద ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. పేలుడు తర్వాత భద్రతా బలగాలకు, మిగిలిన ఉగ్రవాదులకు మధ్య కాల్పులు జరిగినట్టు టర్కీ మీడియా తెలిపింది. ఈ కాల్పుల్లో రెండో ఉగ్రవాది మరణించినట్టు పేర్కొంది. వేసవి సెలవుల అనంతరం పార్లమెంటు సమావేశాలు ఆదివారం నుంచి ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. సమావేశాల ప్రారంభానికి కొన్ని గంటల ముందు ఈ దాడి జరగడం గమనార్హం.