ముగ్గురు కార్మికుల ఆత్మహత్యాయత్నం

– నల్లగొండ జిల్లా ఆస్పత్రిలో ఘటన
– సమస్య అంతా మంత్రిని కలవడం వల్లే..
– కక్షతో కార్మికులను తొలగించిన ఏజెన్సీ
– కాంట్రాక్ట్‌ ఏజెన్సీని తొలగించాలని సిబ్బంది డిమాండ్‌
నవతెలంగాణ-నల్గొండ కలెక్టరేట్‌
నల్లగొండ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రి అవినీతి, అక్రమాల విషయంతో నిత్యం వార్తల్లో నిలుస్తోంది. కొద్దిరోజుల కిందట జిజిహెచ్‌ సూపరింటెండెంట్‌ లచ్చు నాయక్‌ ఓ కాంట్రాక్టర్‌ నుంచి మూడు లక్షల రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడిన వార్త రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. తాజాగా శుక్రవారం నల్లగొండ ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రిలో ముగ్గురు ఔట్‌సోర్సింగ్‌ కార్మికులు ఆత్మహత్యాయత్నం చేసుకోవడం తీవ్ర కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే..
నల్లగొండ ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రిలో సాయి సెక్యూరిటీ అవుట్‌సోర్సింగ్‌ ఏజెన్సీ కింద కార్మికులు పని చేస్తున్నారు. కొన్నేండ్ల నుంచి నల్లగొండ పట్టణానికి చెందిన వల్కి లలిత, మారం నాగమణి శానిటేషన్‌ వర్కర్లుగా, బోడ జానకి పేషంట్‌ కేర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. వీరంతా యూనియన్‌ తరపున.. ఇటీవల ఆస్పత్రికి వచ్చిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిని కలిసి తమ సమస్యలపై చెప్పారు. జీతాలు సమయానికి ఇవ్వటం లేదని, వచ్చే తక్కువ జీతంలో కూడా కోతలు విధిస్తున్నారని, సెలవులు ఇవ్వడం లేదని వాపోయారు. స్పందించిన మంత్రి.. నిబంధనల మేరకు సిబ్బందికి వేతనాలు చెల్లించాలని ఆదేశాలు జారీ చేశారు. మంత్రికి చెప్పారన్న కక్షతో ఏజెన్సీ నిర్వాహకులు ఆ కార్మికులను విధుల నుంచి తొలగించారు. రెండు నెలలుగా సిబ్బంది ఎవరికీ వేతనాలు ఇవ్వని ఏజెన్సీ.. ఈ ముగ్గురికి మాత్రం 29వ తేదీన జీతాలు వేసి.. అనంతరం విధుల నుంచి తొలగించింది. అయినా వారు రోజువారి విధుల్లో భాగంగా శుక్రవారం ఉదయమే డ్యూటీకి వచ్చారు. అయితే, హాజరు రిజిస్టర్‌లో వారి పేర్లు లేకపోవడంతో ఆందోళనకు గురయ్యారు. విషయాన్ని యూనియన్‌ సభ్యులతో చెప్పగా.. వారంతా కలిసి క్యాజువాలిటీ ఎదుట ధర్నాకు దిగారు. గంటకుపైగా ధర్నా చేసినా ఎవరూ స్పందించకపోవడంతో ముగ్గురు కార్మికులు సిట్రిజన్‌ మాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం చేశారు. తోటి కార్మికులు వెంటనే వారిని అదే ఆస్పత్రిలో అడ్మిట్‌ చేశారు. ప్రస్తుతం సూపరింటెండెంట్‌ పర్యవేక్షణలో వారికి చికిత్స చేస్తున్నారు. ఏడాది కిందట ఓ ఉద్యోగిని విధుల నుంచి తొలగించారని, అతన్ని విధుల్లోకి తీసుకోవాలని మంత్రి ద్వారా ఒత్తిడి తేవడం కూడా ఈ ముగ్గురిని తొలగించడానికి ప్రధాన కారణంగా ఆస్పత్రి సిబ్బంది చర్చించుకుంటున్నారు.
మంత్రి ఆదేశాలు పక్కన పెట్టి
ఆస్పత్రిలో పనిచేసే సిబ్బందికి ప్రభుత్వ నిబంధనల ప్రకారం వేతనాలు చెల్లించాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సూపరింటెండెంట్‌కు, ఏజెన్సీ నిర్వాహకులకు ఇటీవల ఆదేశాలు జారీ చేశారు. అయినా ఏజెన్సీ నిర్వాహకులు తమకేమీ పట్టనట్టు ఇష్టారీతిగా వ్యవహరిస్తున్నారు. వాస్తవానికి సిబ్బంది ఒక్కరికి మొత్తం జీతం 15,600 రూపాయలు. అందులో రూ.12093 సిబ్బంది ఖాతాలో జమ చేయాల్సి ఉంటుంది. రూ.3023 పీఎఫ్‌, 484కు పైగా ఈఎస్‌ఐ కట్టాల్సి ఉంది. కానీ సదరు ఏజెన్సీ నిర్వాహకులు నెలకు రూ.11,000 మాత్రమే జీతంగా ఇస్తున్నారు. సుమారు రూ.1000 మాత్రమే పీఎఫ్‌ కడుతున్నారని సిబ్బంది ఆరోపిస్తున్నారు. మొబైల్‌కు ఎప్పుడూ మెసేజ్‌ రాలేదని, ఈ మధ్యనే మెసేజ్‌ వస్తుండటంతో అసలు ఎంత మొత్తం చెల్లిస్తున్నారో వెల్ల్లడైందని చెబుతున్నారు.
ఏజెన్సీని వెంటనే తొలగించాలి: మునగ వెంకన్న (యూనియన్‌ నాయకులు)
అవినీతి అక్రమాలకు పాల్పడుతూ సిబ్బందిని ఇబ్బందులకు గురి చేస్తున్న ఏజెన్సీని వెంటనే తొలగించాలి. జీఓ ప్రకారం వేతనాలను సరైన సమయంలో అందించాలి. సీఎల్స్‌ ఇవ్వడం లేదు. మాకు సెలవులు ఇవ్వాలి. డ్యూటీ డ్రెస్‌ ఇవ్వటం లేదు. వాటిని వెంటనే ఇప్పించాలి.
కలెక్టర్‌ దృష్టికి విషయం
మొదటగా ఏజెన్సీ నిర్వాహకులు వెంకన్న నాకు కాల్‌ చేసి సిబ్బంది ధర్నా చేస్తున్నట్టు చెప్పారు. ఏమైనా ఉంటే మాట్లాడదాం.. మొదట డ్యూటీలోకి వెళ్లాలని చెప్పాలని నేను చెప్పాను. ఉదయం 9:15 గంటలకు నేను రౌండ్స్‌కి వెళ్లే సమయం. ఆ సమయంలో ముగ్గురు సిబ్బంది సిట్రీజన్‌ టాబ్లెట్స్‌ మింగేశారు. అక్కడే ఉన్న డాక్టర్‌ చికిత్స అందించారు. వారి ఆరోగ్యం ప్రస్తుతం బాగానే ఉంది. మిగతా సిబ్బందికి ఎమర్జెన్సీ సర్వీసులు ఆపొద్దని.. సమస్యలు ఏమైనా ఉంటే పై అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని చెప్పాను. విషయాన్ని జిల్లా కలెక్టర్‌కు తెలియజేశాను.
-డాక్టర్‌ నిత్యానంద్‌ సూపరింటెండెంట్‌