ఆర్థిక, అనారోగ్య సమస్యలతో.. కుమార్తెతో సహా దంపతుల ఆత్మహత్య

నవతెలంగాణ-పెనుబల్లి
ఆర్థిక, అనారోగ్య సమస్యలతో తీవ్ర మనస్తాపానికి గురైన దంపతులు.. కుమార్తెతో సహా ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం కొత్తకారాయగూడెం గ్రామంలో గురువారం రాత్రి జరిగింది. పోట్రు వెంకట కృష్ణారావు (40), సుహాసిని (38) దంపతులకు అమృత (18), కార్తీక్‌ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. సుహాసినికి నెలన్నర క్రితం ఆంధ్రప్రదేశ్‌ లోని కృష్ణా జిల్లా తిరువూరులో గర్భసంచికి శస్త్రచికిత్స జరిగింది. అప్పుడు నమూనాలను బయాప్సీకి పంపగా గురువారం క్యాన్సర్‌గా నిర్ధారణ అయింది. తిరువూరు వైద్యులను సంప్రదించగా కీమో థెరపీకి హైదరాబాద్‌ వెళ్లాలని సూచించారు. ఈ క్రమంలో దంపతులతో పాటు కూతురు అమృత(18) ముగ్గురూ తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. తిరువూరు నుంచి స్వగ్రామానికి వచ్చేటప్పుడు మూడు స్టూళ్లు, తాడు కొనుగోలు చేసుకొని వచ్చారు. అనంతరం కొత్త కారాయిగూడెంలోని మామిడితోటకు చేరుకున్నారు. గురువారం రాత్రి అక్కడే మామిడిచెట్టుకు ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డారు. శుక్రవారం ఉదయం స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి సీఐ హనూక్‌, ఎస్‌ఐ సూరజ్‌ చేసుకొని పరిశీలించారు. ఇది ఇలా ఉండగా వీరి కుమారుడు కార్తీక్‌ బెంగళూరులో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేస్తూ ఇటీవలే స్వగ్రామానికి వచ్చాడు. తను ఇంటి వద్ద ఉండిపోవడం, చెల్లితో సహా తల్లిదండ్రులు ఆస్పత్రికని వెళ్లి తిరిగి ఇంటికి రాకుండా ఆత్మహత్య చేసుకోవడంతో తీవ్ర దు:ఖంలో మునిగిపోయాడు.