దర్శకుడు సుకుమార్ సతీమణి తబిత సమర్పణలో విడుదల అవుతున్న సినిమా ‘మారుతీ నగర్ సుబ్రమణ్యం’. రావు రమేష్ కథానాయకుడు. లక్ష్మణ్ కార్య దర్శకత్వం వహించారు. పీబీఆర్ సినిమాస్, లోకమాత్రే సినిమాటిక్స్ సంస్థలపై బుజ్జి రాయుడు పెంట్యాల, మోహన్ కార్య నిర్మించారు. రావు రమేష్ సరసన ఇంద్రజ, అంకిత్ కొయ్య, రమ్య పసుపులేటి మరో జంటగా, హర్షవర్ధన్ కీలక పాత్రలో నటించారు. ఈనెల 23న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా దర్శకుడు లక్ష్మణ్ కార్య మీడియాతో మాట్లాడుతూ, ‘హ్యాపీ వెడ్డింగ్’ తర్వాత దర్శకుడిగా ఇది నా రెండో సినిమా. మా వైఫ్‌కి జరిగిన ఒక ఘటన స్ఫూర్తితో ఈ కథ రాశాను. అలాగే అల్లు అరవింద్ మీద డైలాగ్, అల్లు అర్జున్ పాటల స్ఫూర్తితో ఓ సాంగ్ తీశాం. ఇది ఎందుకు తీశామన్నది సినిమాలో చూస్తేనే బాగుంటుంది. నా వైఫ్, సుకుమార్‌వైఫ్ తబితకి కామన్ ఫ్రెండ్స్ ఉన్నారు. సినిమా అంతా అయ్యాక ఓసారి తబితకి చెప్పమని నా భార్యను అడిగా. తను చెబితే తబిత, సుకుమార్ పిలిచి మాట్లాడారు. ఓ రోజు తబితకి ప్రివ్యూ వేశా. ఆమె సినిమా బావుందని మెచ్చుకున్నారు. అదే రోజు తబితతో మైత్రి శశి వచ్చారు. ఆయనకూ సినిమా నచ్చింది. ఆ తర్వాత నవీన్ ఎర్నేని, రవిశంకర్‌కి సినిమా చూపిద్దామని చెప్పారు. వాళ్లకూ నచ్చింది. డిస్ట్రిబ్యూషన్ చేస్తామని చెప్పారు. అలాగే ఈసినిమాని సుకుమార్ చూశారు. రావు రమేష్ అద్భుతంగా చేశారని, సినిమా బాగా తీశావని చెప్పారు. నేను ఆనందంలో తేలిపోయా. ఆయన మాటలు నాకు మరింత కాన్ఫిడెన్స్ ఇచ్చాయి. ఈనెల 23న ప్రేక్షకులు కూడా సినిమా చూసినప్పుడు అంతే ఆనందంగా నవ్వుతారని ఆశిస్తున్నాను’ అని చెప్పారు.